Andhra Pradesh: విభజన హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అగ్రిగోల్డ్ రాజకీయం!: బీజేపీపై కుటుంబరావు నిప్పులు

  • బీజేపీ నేతలు దేశంపై ఆంబోతుల్లా పడ్డారు
  • 9 నెలల్లోనే అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేశాం
  • హైకోర్టు కూడా పోలీసులను ప్రశంసించింది

ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ వ్యవహారంపై అధికార టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అగ్రిగోల్డ్ భూములను దోచుకునేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించగా, భూములు కొనకుండా జీఎస్సెల్ గ్రూపును బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బెదిరించారని టీడీపీ నేత కేశినేని నాని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం తరఫున ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఈరోజు మీడియాతో మాట్లాడారు.

ట్విట్టర్ ద్వారా ఆంబోతు రాజకీయాలను మొదలుపెట్టింది బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావేనని కుటుంబరావు విమర్శించారు. బీజేపీ నేతలు ఆంబోతుల్లా దేశాన్ని దోచుకుతింటున్నారనీ, దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ నుంచి సంక్షేమ పథకాల వరకూ బీజేపీ దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోయిందన్నారు. ఏపీ విభజన హామీలు, ప్రత్యేక హోదాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే బీజేపీ నేతలు అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.

అగ్రిగోల్డ్ వ్యవహారంలో 2014, డిసెంబర్ లో తొలి కేసును పెట్టింది ఏపీ ప్రభుత్వమేనని కుటుంబరావు గుర్తుచేశారు. దేశంలోని మిగతా 8 రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత త్వరగా చర్యలు తీసుకోలేదన్నారు. శారదా చిట్ ఫండ్, సహారా కుంభకోణం వ్యవహారాల్లో సీబీఐ కంటే తొందరగానే ఏపీ సీఐడీ అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్ చేసిందన్నారు. కేవలం 9 నెలల్లోనే నిందితులపై చర్యలు తీసుకున్నామన్నారు.

అయితే 2015లో సరిగ్గా వేలం వేసే సమయానికి అగ్రిగోల్డ్ కేసును సీబీఐకి అప్పగించాలని కొందరు ఏజెంట్లు హైకోర్టును ఆశ్రయించారన్నారు. దీన్ని విచారించిన కోర్టు సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదనీ, సీబీ సీఐడీ అద్భుతంగా దర్యాప్తు చేసిందని కితాబిచ్చిందన్నారు. అయితే ఈ విషయంలో హైకోర్టు సీబీ సీఐడీకి మొట్టికాయలు వేసిందని బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. దమ్ముంటే ఇలా హైకోర్టు చెప్పినట్లు ఒక్క కాగితాన్ని అయినా చూపాలని డిమాండ్ చేశారు.

More Telugu News