YSRCP: వెనక్కి తగ్గేది లేదు.. సాధికార మిత్రలపై మళ్లీ రివ్యూ పిటిషన్ వేస్తా!: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి

  • ఏపీ ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కింది
  • రూ.1.000 కోట్ల దోపిడీకి చంద్రబాబు కుట్ర
  • పిటిషన్ కొట్టివేతపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే

ఆంధ్రప్రదేశ్ లో ‘సాధికార మిత్ర’ల నియామకాలను సవాలు చేస్తూ తాను వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేయడంపై వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి స్పందించారు. చట్టాలను తుంగలో తొక్కుతూ చంద్రబాబు సాధికార మిత్రలను నియమించారని ఆర్కే విమర్శించారు. టీడీపీ కార్యకర్తలను సాధికార మిత్రలుగా నియమించారనీ, తద్వారా తన జేబు సంస్థలకు రూ.1,000 కోట్లు దోచిపెట్టేందుకు బాబు సిద్ధమయ్యారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుపై మరోసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు.

ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత సన్నిహితం చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది మహిళలను ‘సాధికార మిత్ర’లుగా ఏపీ ప్రభుత్వం 2017లో నియమించింది. దాదాపు 35 కుటుంబాలకు ఓ సాధికార మిత్ర చొప్పున 4 లక్షల మంది మహిళలతో ఓ సేవాదళాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పథకాల అమలులో లోటుపాట్లను టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా ప్రభుత్వ ఉన్నతాధికారులకు వీరు చేరవేయాల్సి ఉంటుంది.

దీంతో ఈ నియామకాలను సరైన పద్దతిలో చేపట్టలేదనీ, వీటిని వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఆర్కే పిటిషన్ లో విచారించదగ్గ అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది. 

More Telugu News