agri gold: ఆంధ్రప్రదేశ్ లో మాఫియా రాజ్యం నడుస్తోంది.. అగ్రిగోల్డ్ భూములను కొట్టేసేందుకు కుట్ర!: బీజేపీ నేత జీవీఎల్ ఆరోపణ

  • ప్రభుత్వం వల్లే అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం
  • సొంత మాఫియాకు అప్పగించేందుకు ప్రభుత్వ కుట్ర
  • బీహార్ లో ఆర్జేడీకి పట్టిన గతే టీడీపీకి పడుతుందని వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల అవినీతి కారణంగానే ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరుగుతోందని బీజేపీ అధికార ప్రతినిధి, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ప్రజల సొమ్మును దోచుకునేందుకు తెలుగుదేశం నేతలు యత్నించారని ఆరోపించారు. ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోందని దుయ్యబట్టారు. అధికార పార్టీకి అనుకూలమైన ల్యాండ్ మాఫియాకు అగ్రిగోల్డ్ భూములను అప్పగించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ విజయవాడలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఐదు రోజుల రిలే నిరాహార దీక్షలను ఈరోజు ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, పార్లమెంటు సభ్యుడు జీవీఎల్ సహా పలువురు ముఖ్య నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జీవీఎల్ టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం ఏపీలో బిహార్ లో మాజీ సీఎం లాలూప్రసాద్ యాదవ్ తరహాలో అవినీతి ప్రభుత్వం నడుస్తోందని జీవీఎల్ ఘాటుగా విమర్శించారు. బిహార్ లో లాలూ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కి పట్టిన గతే టీడీపీకి వస్తుందని హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ టీడీపీ అక్రమాలు పెరిగిపోతున్నాయని నరసింహారావు ఆరోపించారు.

More Telugu News