ICC: భారత్, ఇంగ్లండ్ మ్యాచ్ లో ఫిక్సింగ్... మరో 15 మ్యాచ్ లు కూడా: అల్ జజీరా స్టింగ్ ఆపరేషన్

  • లార్డ్స్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ఫిక్స్
  • 2011 వరల్డ్ కప్, 2012 టీ-20 వరల్డ్ కప్ కూడా
  • 'క్రికెట్ మ్యాచ్ ఫిక్సర్స్: ది మునావర్ ఫైల్స్' పేరిట అల్ జజీరా డాక్యుమెంటరీ
  • దావూద్ గ్యాంగ్ తో ఉమర్ అక్మల్ కలిసున్న దృశ్యాలు కూడా విడుదల

క్రికెట్ లో మ్యాచ్ ఫిక్సింగ్ భూతంపై అల్ జజీరా జరిపిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఐసీసీ నిఘా పెట్టివున్నప్పటికీ, మ్యాచ్ ఫిక్సర్ అనీల్ మునావర్, ఆరు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ-20లు సహా 15 మ్యాచ్ లను ఫిక్స్ చేశాడని 'క్రికెట్ మ్యాచ్ ఫిక్సర్స్: ది మునావర్ ఫైల్స్' పేరిట విడుదల చేసిన డాక్యుమెంటరీలో తెలిపింది. ఇంగ్లండ్ ఆటగాళ్లకు 7 మ్యాచ్ లలో, ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐదు మ్యాచ్ లలో, పాకిస్థాన్ ఆటగాళ్లకు మూడు మ్యాచ్ లలో ఫిక్సింగ్ కు సంబంధం ఉందని, 2011లో లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ విజేత కూడా ముందే నిర్ణయించబడిందని తెలిపింది.

అదే సంవత్సరం కేప్ టౌన్ లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్, 2011 వరల్డ్ కప్ లో ఐదు వన్డేలు, 2012లో శ్రీలంకలో జరిగిన వరల్డ్ టీ-20లో మూడు మ్యాచ్ లు ఫిక్స్ అయ్యాయని తెలిపింది. 2012లో యూఏఈలో ఇంగ్లండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల్లోనూ ఫిక్సర్లు విజయవంతమయ్యారని తెలిపింది. క్రికెట్లో అవినీతిని తగ్గించేందుకు ఐసీసీ ఎటువంటి చర్యలనూ తీసుకోవడం లేదని అల్ జజీరా తన డాక్యుమెంటరీలో వ్యాఖ్యానించింది.

ఓ హోటల్ లో దావూద్ కంపెనీకి చెందిన వ్యక్తిని పాక్ ఆటగాడు ఉమర్ అక్మల్ కలిసిన దృశ్యాలను సదరు చానల్ చూపించింది. అక్మల్ పై ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. కాగా, అల్ జజీరా డాక్యుమెంటరీపై స్పందించిన ఐసీసీ, స్పాట్‌ ఫిక్సింగ్‌ కు సంబంధించి ఆ చానల్ వద్ద ఉన్న దృశ్యాలను, ఆధారాలను తమకు అందించాలని కోరుతున్నా, తమతో పంచుకోవడానికి నిరాకరిస్తున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదని పేర్కొంది. తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలనూ సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

More Telugu News