YSRCP: వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి షాక్.. ‘సాధికార మిత్ర’లపై పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!

  • 4 లక్షల మందిని నియమించిన ప్రభుత్వం
  • సరైన పద్ధతి పాటించలేదని ఆర్కే పిటిషన్
  • ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చిన హైకోర్టు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీం కోర్టులో ఈరోజు ఎదురుదెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘సాధికార మిత్ర’ నియామకాలపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా ఇలాంటి నియామకాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనివని ధర్మాసనం స్పష్టం చేసింది.

ప్రజలకు ప్రభుత్వాన్ని మరింత సన్నిహితం చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది మహిళలను ‘సాధికార మిత్ర’లుగా ఏపీ ప్రభుత్వం 2017లో నియమించింది. దీంతో ఈ నియామకాలను సరైన పద్ధతిలో చేపట్టలేదనీ, వీటిని వెంటనే రద్దు చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

రామకృష్ణారెడ్డి పిటిషన్ ను ఈ రోజు విచారించిన అత్యున్నత న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది. ఎమ్మెల్యే దాఖలు చేసిన పిటిషన్ లో కొత్తగా విచారణార్హత ఉన్న అంశాలేవీ లేవని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ, రామకృష్ణారెడ్డి దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారించేందుకు తిరస్కరించింది.

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, ప్రభుత్వానికి ప్రజల్ని దగ్గర చేసేందుకు సాధికార మిత్రలను ఏపీ ప్రభుత్వం గతేడాది నియమించింది. దాదాపు 35 కుటుంబాలకు ఓ సాధికార మిత్ర చొప్పున 4 లక్షల మంది మహిళలతో ఓ సేవాదళాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ పథకాల అమలులో లోటుపాట్లను టోల్ ఫ్రీ నంబర్ 1100 ద్వారా వీరు ఉన్నతాధికారులకు తెలియజేస్తారు.

More Telugu News