USA: తెలుగు ఘనత... అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న భాషగా రికార్డు!

  • ఏడేళ్లలో 86 శాతం పెరిగిన తెలుగువారి సంఖ్య
  • వెల్లడించిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్
  • అమెరికాలో 4 లక్షల మంది తెలుగువారు

తెలుగు భాష మరో అరుదైన గుర్తింపును తెచ్చుకుంది. యూఎస్ఏలో శరవేగంగా విస్తరిస్తున్న భాషగా నిలిచింది. అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనాన్ని నిర్వహించి, ఈ విషయాన్ని వెల్లడించగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అమెరికాలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2010 నుంచి 2017 మధ్య కాలంలో 86 శాతం పెరిగిందని పేర్కొంది.

ఇదే సమయంలో ఇండియాలో అత్యధికులు మాట్లాడే భాషల్లో నాలుగో స్థానంలో ఉన్న తెలుగు, అమెరికాలో ఇంగ్లీష్ మినహా ఎక్కువగా మాట్లాడే భాషల్లో ఇప్పటికీ టాప్-20లోకి రాకపోవడం గమనార్హం. యూఎస్ కు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ అనే సంస్థ జనాభా గణాంకాలు, అమెరికాలో కాలుమోపుతున్న వారి స్వస్థలాలు, వారి మాతృభాష తదితరాల ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించింది. 2010తో పోలిస్తే తెలుగు మాట్లాడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని, అమెరికాలో ఇప్పుడు 4 లక్షల మంది తెలుగు వారు ఉన్నారని పేర్కొంది.

 హైదరాబాద్ వంటి నగరాల్లో యూఎస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూషన్స్ పెరగడంతో ఏపీ, తెలంగాణల నుంచి ఇక్కడికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని తెలుగు పీపుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కునిశెట్టి ప్రసాద్ అభిప్రాయపడ్డారు. 1990 దశకంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగిన తరువాత తెలుగువారి రాక అధికమయిందని చెప్పారు.

అమెరికాలో తెలుగు మాట్లాడే ప్రముఖుల్లో తొలి 'ఇండియన్ అమెరికన్ మిస్ అమెరికా' నీనా దావులూరి, ప్రస్తుత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తదితరులు ఉన్నారన్న సంగతి తెలిసిందే. అమెరికాలో మొత్తం జనాభా 32 కోట్లు కాగా, సుమారు 6 కోట్ల మంది ఇంగ్లీష్ మినహా మిగతా భాషలు మాట్లాడేవారే. యూఎస్ లో ఇంగ్లీషు తరువాత అత్యధికులు మాట్లాడే భాష స్పానిష్. ఇక ఇతర భారతీయ భాషల్లో హిందీ, ఉర్దూ, గుజరాతీ, తెలుగు మాట్లాడేవారు కూడా లక్షల్లోనే ఉన్నారని సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ వెల్లడించింది.

More Telugu News