Warangal Rural District: అన్నదాత వెన్ను విరిచాడు...రూ.కోటి ధాన్యం కొనుగోలు చేసి డబ్బివ్వకుండా పరారు

  • వందమంది రైతులను నిండా ముంచేశాడు
  • ఎప్పటి నుంచో వ్యాపారం చేస్తూ నమ్మకంగా ఉంటూనే టోకరా
  • వరంగల్‌ జిల్లాలో ఘటన

ఓ ధాన్యం వ్యాపారి రైతుల్ని నిండా ముంచేశాడు. ఆరుగాలం శ్రమపడి పండించిన పంటను చేజిక్కించుకుని డబ్బివ్వకుండా పరారయ్యాడు. మూడేళ్లుగా తమలో ఒకడిగా మారిపోయి వ్యాపారం పేరుతో దగ్గరైన వ్యక్తి నమ్మించి మోసం చేయడంతో అన్నదాతలు లబోదిబో మంటున్నారు. వివరాల్లోకి వెళితే...వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన ఈర్ల స్వామి వ్యవసాయ ఉత్పత్తులు కొని అమ్ముతుంటాడు. మూడేళ్లుగా వ్యాపారం పేరుతో గ్రామాల్లో తిరుగుతూ రైతులకు దగ్గరయ్యాడు.

సాధారణ వ్యాపారుల కంటే అధిక ధర ఇస్తూ ఆకట్టుకున్నాడు. పసుపు, మక్కలు, పత్తి, వేరుశనగ, ధాన్యం కొనుగోలు చేస్తూ వారికి అండగా ఉండేవాడు. దీంతో రైతులంతా అతన్ని పూర్తిగా నమ్మారు. రూపాయి చేతిలో పెట్టకున్నా తమ పంటల్ని అతనికి ఇచ్చేసి డబ్బు ఇచ్చినప్పుడు తీసుకునేవారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వంద మంది రైతులు దాదాపు కోటి రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని స్వామికి అమ్మారు. ఎప్పటిలాగే తర్వాత డబ్బు తెచ్చిస్తాడని అనుకున్నారు.

రెండు నెలలైనా స్వామి డబ్బు తెచ్చివ్వక పోవడం, ముఖం కూడా చూపించకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు రైతులు ఈనెల 19వ తేదీన అతని ఇంటికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉంది. అతని నంబర్‌కి ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. అనుమానం వచ్చిన రైతులు అతని గురించి ఆరాతీస్తే కొన్నాళ్లుగా జాడలేదని తేలింది. దీంతో స్వామి తమకు ఇవ్వాల్సిన డబ్బుతో పరారయ్యాడన్న నిర్థారణకు వచ్చిన రైతులు ఆదివారం పోలీసులను ఆశయ్రించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More Telugu News