hanging resturent: ఆకాశంలో అతిథి మర్యాద...ఓ రెస్టారెంట్‌ నిర్వాహకుల వినూత్న ఆలోచన

  • 160 అడుగుల ఎత్తున భోజనం చేసే అవకాశం
  • బెంగళూరు అందాలను చూస్తూ విందారగించే సదుపాయం
  • ఖర్చు కాస్త ఎక్కువే అయినా ప్రత్యేకత కోరుకునే వారికి ట్రెండింగ్

కస్టమర్‌ను రప్పించాలంటే ప్రత్యేకత చాటాలి...వినూత్న ఆలోచనలతో ఆకట్టుకోవాలి...అప్పుడే వ్యాపారం జోరందుకుంటుంది... హోటల్‌ బిజినెస్‌కు ఇది మరింత అవసరం...నింగి, నేలపై అద్భుతాలు చేయాలని, అచ్చెరువొందించే కార్యక్రమాల్లో పాల్గొనాలని తహతహలాడే వారు ఎందరో ఉంటారు. అటువంటి ప్రత్యేక వ్యక్తుల కోసం తామో ప్రత్యేక ఆతిథ్యాన్ని అందిస్తున్నామంటోంది బెంగళూరు మహానగరంలో వేలాడే రెస్టారెంట్‌ నిర్వాహక సంస్థ. 160 అడుగుల ఎత్తున తెలిసీ తెలియనంత వేగంతో తిరుగుతూ బెంగళూరు అందాలను వీక్షిస్తూనే చక్కని విందుభోజనాన్ని ఆరగించవచ్చని చెబుతోందీ సంస్థ.

వివరాల్లోకి వెళితే... బెంగళూరు హెబ్బాల్ లోని నాగవార చెరువు గట్టున ఈ వేలాడే రెస్టారెంట్‌ ఉంది. ఈ సంస్థ తమ రెస్టారెంట్‌కు వచ్చే అతిథులకు ప్రత్యేక డైనింగ్‌ టేబుల్‌తో స్వాగతం పలుకుతోంది. క్రేన్‌లాంటి పొడవాటి స్తంభానికి సర్క్యులర్‌ రూపంలో ఏర్పాటు చేసిన ఈ డైనింగ్‌ టేబుల్‌పై ఒకేసారి 22 మంది ఆతిథ్యం తీసుకోవచ్చు. వీరంతా తమ సీట్లలో కూర్చున్నాక స్తంభానికి, డైనింగ్‌ టేబుల్‌తో చేసిన ఏర్పాటు వల్ల టేబుల్‌ 160 అడుగుల ఎత్తుకు వెళ్తుంది. పైకి వెళ్లాక 360 డిగ్రీ కోణంలో టేబుల్‌ తిరుగుతుంటుంది.

అతిథులు నగర అందాలు చూస్తూ మైమరచిపోతున్న వేళ అతిథుల సేవ కోసం ఉన్న ఐదుగురు సిబ్బంది కావాల్సిన ఆహార పదార్థాలు వడ్డిస్తారు. వీటిని ముందుగానే రెస్టారెంట్‌లో తయారుచేసి పైకి తీసుకువెళ్లాక వేడిచేసి అందజేస్తారు. నచ్చిన వంటకాన్ని తింటూ ఎంచక్కా ఆనందింవచ్చునన్నమాట. అయితే ఈ ఆతిథ్యం స్వీకరించేందుకు కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయండోయ్‌. వయసు 12 ఏళ్లు దాటి ఉండాలి. కనీస ఎత్తు 4.5 అడుగులు తప్పనిసరి. 150 కిలోల బరువుకు మించి ఉండకూడదు.

గుండె జబ్బు, వర్టిగో ఉన్న వారిని, గర్భిణులను, మద్యం సేవించిన వారిని అనుమతించరు. సెల్‌ఫోన్‌ తప్ప కెమెరాలు, ఇతర బ్యాగులు పైకి తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. కేవలం అరగంటలోనే అతిథ్యం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఖర్చు కూడా అధికమే. ‘అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పటికే ఈ తరహా రెస్టారెంట్లు ఉన్నాయి. మేము కూడా చండీగఢ్‌లో ప్రయోగం చేశాం. అన్నీ బాగున్నాయనుకున్న తర్వాత బెంగళూరు నగరాన్ని ఎన్నుకున్నాం’ అని రెస్టారెంట్  నిర్వాహకురాలు నివేదిత తెలిపారు.

More Telugu News