Telangana: ఐఏఎస్ అధికారినంటూ మున్సిపల్ చైర్మన్లకు బురిడీ.. గుంటూరు యువకుడిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్!

  • నిరుద్యోగంతో మోసాల బాటపట్టిన బాలాజీ
  • తెలంగాణ మున్సిపల్ ముఖ్య కార్యదర్శిగా అవతారం
  • మున్సిపల్ చైర్మన్లు లక్ష్యంగా మోసాలు

అతనో నిరుద్యోగి. అయితేనేం మోసాలకు బాగా అలవాటు పడ్డాడు. ఏకంగా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అవతారం ఎత్తాడు. తెలంగాణలోని చాలామంది మున్సిపల్ చైర్మన్లకు ఫోన్ చేసి కేంద్రం నుంచి నిధులు వచ్చాయనీ, వాటిని విడుదల చేయాలంటే కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే దీనికి స్పందించిన ఓ చైర్మన్ భర్త అడిగినంత సమర్పించుకుని మోసపోయారు. చివరికి బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బాలాజీ నాయుడు(41) మోసాలకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఏకంగా తెలంగాణ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా అవతారం ఎత్తిన బాలాజీ.. పలువురు మున్సిపల్ చైర్మన్లకు ఫోన్ చేశాడు. కేంద్రం నుంచి భారీగా నిధులు వచ్చాయనీ, వాటిని మంజూరు చేయాలంటే కొంతమొత్తం కమీషన్ గా సమర్పించుకోవాలని సూచించాడు. ఈ క్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ప్రవల్లిక భర్త ప్రకాశ్ కు ఫోన్ చేశాడు. మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.2 కోట్ల నిధులు మంజూరు అయ్యాయనీ, విడుదల చేయాలంటే రూ.30 వేలు కమిషన్ ఇవ్వాలని సూచించాడు.

దీంతో అతను చెప్పినట్లే రూ.30 వేల కమీషన్ ను ప్రకాశ్ ఓ బ్యాంకు అకౌంట్ లో జమ చేశాడు. అయితే డబ్బు డిపాజిట్ కాగానే బాలాజీ ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సూర్యాపేట రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ అధికారులు.. నిందితుడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టారు. ఈ నేపథ్యంలో వేర్వేరు వ్యక్తులను మోసగించినట్లు బాలాజీపై 30కిపైగా కేసులు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు విస్తుపోతున్నారు.

More Telugu News