Karnataka: చీరలకు స్వస్తి.. ఇక ప్యాంటులు, షర్టులు ధరించాల్సిందే: కర్ణాటక మహిళా పోలీసులకు ఆదేశాలు

  • మహిళా పోలీసులు విధిగా ప్యాంటు, షర్టు ధరించాల్సిందే
  • ఆదేశాలు జారీ చేసిన డీజీ నీలమణి
  • నిర్ణయం తక్షణం అమల్లోకి

కర్ణాటకలోని మహిళా పోలీసులు ఇకపై చీరల్లో కనిపించకపోవచ్చు. మహిళా పోలీసులు ఇకపై విధిగా ఖాకీ యూనిఫాం అయిన ప్యాంటు, షర్టు, బెల్టు, బూటు ధరించాల్సిందేనని డీజీ/ఐజీపీ నీలమణి ఎన్.రాజు ఆదేశాలు జారీ చేశారు. చీరలో కంటే ప్యాంటు, షర్టు సౌకర్యంగా ఉంటుందని, నేరం జరిగినప్పుడు వేగంగా స్పందించవచ్చని పేర్కొన్నారు. మహిళా పోలీసు అధికారులు సహా సీనియర్ పోలీసు అధికారులతో జరిగిన సమావేశం అనంతరం డీజీపీ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపారు.

ఇప్పటి వరకు పెద్ద ర్యాంకుల్లో ఉన్న మహిళా పోలీసులు షర్టులు, ప్యాంటులు ధరిస్తుండగా, కానిస్టేబుళ్లు మాత్రం చీరలు ధరిస్తున్నారు. అయితే, ఇకపై ప్రత్యేక సందర్భాల్లో తప్ప చీరలు ధరించడం కుదరదని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇకపై రాష్ట్రంలోని మహిళా పోలీసులందరూ విధిగా ప్యాంటు, షర్టు ధరించాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని మొత్తం 95 వేల మంది పోలీసుల్లో 5 వేల మంది మహిళా పోలీసులు ఉన్నారు. ఈ ఏడాది జూలైలో కర్ణాటక రిజర్వ్ పోలీసు అధికారులు కూడా ఇటువంటి నిర్ణయాన్నే తీసుకున్నారు. చీరలకు బదులు ట్రౌజర్స్, షర్టులు ధరించడం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News