Sabarimala: అయ్యప్పను చూడాలంటూ పంబ వరకూ వచ్చిన దళిత మహిళ నాయకురాలు మంజు... చేతులెత్తేసిన పోలీసులు!

  • పంబకు వచ్చిన దళిత మహిళా ఫెడరేషన్ నాయకురాలు
  • వర్షం పడుతూ ఉండటంతో భద్రత అసాధ్యమన్న పోలీసులు
  • మరోసారి వస్తానంటూ వెనుదిరిగిన మంజు
  • కందరారు రాజీవర్ వ్యాఖ్యలపై టీబీడీ బోర్డు ఖండన

శబరిమలలోని అయ్యప్పను చూడాలంటూ మూడు పదుల వయసులో ఉన్న దళిత మహిళా ఫెడరేషన్ నాయకురాలు మంజును పోలీసు అధికారులు తిప్పి పంపారు. పంబ, సన్నిధానం ప్రాంతంలో వర్షం కురుస్తూ ఉండటంతో పోలీసు రక్షణ కల్పించలేమని, కొండపై భక్తుల సంఖ్య అధికంగా ఉండటంతో, కొంతదూరం తీసుకెళ్లినా, అక్కడి నుంచి వెనుదిరగక తప్పదని పోలీసులు స్పష్టం చేయడంతో, ఆమె తన ఆలోచనను విరమించుకున్నారని తెలుస్తోంది. మరో రోజున తాను దర్శనానికి వస్తామని ఆమె చెప్పగా, ఆమె నేపథ్యంపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

కాగా, సంప్రదాయాలకు భంగం వాటిల్లితే, అయ్యప్ప గర్భాలయాన్ని మూసి వేస్తానని ప్రధాన అర్చకులు కందరారు రాజీవరు చేసిన హెచ్చరికలను ట్రావన్ కోర్‌ దేవస్థానం బోర్డు తీవ్రంగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్న టీబీడీ సభ్యుడు, కేపీ శంకర్ దాస్, పందళ రాజకుటుంబ సభ్యులు, ఆలయ అర్చకులు కలసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆలయం ముందు ఆందోళన చేసిన సహాయ అర్చకులకు నోటీసులు ఇచ్చి, వివరణ కోరనున్నట్టు తెలిపారు.

More Telugu News