India: నేటి నుంచి వన్డే క్రికెట్... సచిన్ రికార్డుపై కన్నేసిన కోహ్లీ, ఇంతవరకూ ఎవరికీ సాధ్యంకాని రికార్డు కోసం ధావన్!

  • మరో 221 పరుగులు చేస్తే సచిన్ కన్నా తక్కువ ఇన్నింగ్స్ లో 10 వేల క్లబ్ లోకి కోహ్లీ
  • 177 పరుగులు చేస్తే, అతి తక్కువ ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్
  • రికార్డులపై కన్నేసిన భారత ఆటగాళ్లు

వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన ఉత్సాహంలో ఉన్న భారత క్రికెట్ జట్టు, నేటి నుంచి వన్డే సిరీస్ ను ఆడనుంది. రెండు టెస్టు మ్యాచ్ లనూ మూడు రోజుల్లోనే ముగించిన టీమిండియా, వన్డేల్లోనూ అదే విధమైన ప్రదర్శన కనబరుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే, టెస్టులతో పోలిస్తే, వన్డేల్లో విండీస్ జట్టు బలంగా కనిపిస్తోంది. నేటి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి గువాహటిలో మ్యాచ్ జరగనుండగా, ఆసియా కప్ లో ఆడని కోహ్లీ, మరోసారి జట్టు పగ్గాలను అందుకోనున్నాడు. యువ ఆటగాడు రిషబ్ పంత్, జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఈ టోర్నీని ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు.

ఇప్పటివరకూ వెస్టిండీస్, ఇండియా మధ్య 121 మ్యాచ్ లు జరుగగా, ఇండియా 56 మ్యాచ్ లలో, విండీస్ 61 మ్యాచ్ లలో గెలిచింది. ఇక ఈ మ్యాచ్ లో పలువురు ఆటగాళ్లు రికార్డులపై కన్నేశారు. వన్డేల్లో 10 వేల పరుగులను సాధించడానికి కోహ్లీకి ఇంకా 221 పరుగులు అవసరం. సచిన్ ఈ ఫీట్ ను 259 ఇన్నింగ్స్ లో అందుకోగా, ఈ సిరీస్ లో కోహ్లీ 221 పరుగులు చేస్తే, సచిన్ రికార్డును అధిగమించిన వాడవుతాడు. ఇక శిఖర్ ధావన్, ఇదే సిరీస్ లో 177 పరుగులు చేస్తే, 5 వేల పరుగుల మైలురాయిని అతి తక్కువ ఇన్నింగ్స్ లో అందుకున్న భారత ఆటగాడిగా నిలుస్తాడు. 2014 తరువాత భారత్ పై వెస్టిండీస్ వన్డే సిరీస్ ను గెలిచిన సందర్భం లేకపోవడం గమనార్హం.

తుది జట్లు (అంచనా)
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్‌ శర్మ, శిఖర్ ధవన్, అంబటి రాయుడు, రిషబ్‌ పంత్, ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, కుల్దీప్ సింగ్, చాహల్, ఉమేశ్ యాదవ్, మొహమ్మద్ షమీ/ఖలీల్ అహ్మద్.
వెస్టిండీస్ జట్టు: హోల్డర్ (కెప్టెన్), అంబ్రిస్, కీరన్ పావెల్, షాయి హోప్, షిమ్రన్ హెట్‌మైర్, మార్లోన్, రోవ్‌ మెన్, ఆష్లే నర్స్, కీమో పాల్, దేవేంద్ర బిషు, అల్‌ జరీ జోసెఫ్/కీమర్ రోచ్.

More Telugu News