pawan kalyan: టీడీపీకి ఒక అవకాశం ఇద్దాం.. లేకపోతే జనసేన అధికారంలోకి రాగానే మనమే నిర్మించుకుందాం: పవన్ కల్యాణ్

  • బలసలరేవు వంతెన కోసం వాల్తేరు గ్రామస్తులు చేస్తున్న దీక్షకు పవన్ సంఘీభావం
  • చిన్న వంతెనను కూడా కట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ విమర్శ
  • 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వడానికే వచ్చానన్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన వాల్తేరు గ్రామాన్ని సందర్శించారు. బలసలరేవు వంతెన కోసం వాల్తేరు గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లి, గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనమంతా సామాన్యులమని, మనకు చిన్నిచిన్ని సమస్యలే ఉంటాయని చెప్పారు. రూ. 9 కోట్లతో పూర్తి కావాల్సిన వంతెన అంచనాలు ఈరోజు రూ. 60 కోట్లకు చేరుకున్నాయని విమర్శించారు. బలసలరేవు వంతెనను పూర్తి చేయడానికి టీడీపీ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తున్నానని... లేకపోతే, జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత మనమే వంతెనను నిర్మించుకుందామని చెప్పారు.

ఒక చిన్న వంతెనను కూడా నిర్మించలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని పవన్ విమర్శించారు. వంతెన కోసం 608 రోజులు రిలే దీక్షలు చేయడం సామాన్యమైన విషయం కాదని అన్నారు. తనకేమీ వేల కోట్లు లేవని, మీ అభిమానమే తన బలమని చెప్పారు. మీ అందరికీ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సీఎం సీఎం అని అరిస్తే మార్పు రాదని, జనసేనకు ఓట్లు వేస్తేనే మార్పు వస్తుందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా తన నానమ్మ జిల్లా అని తెలిపారు. జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ... ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని మండిపడ్డారు. ఇతర పార్టీల మాదిరి 25 కేజీల బియ్యం ఇవ్వడానికి తాను రాలేదని... 25 ఏళ్ల భవిష్యత్తును ఇవ్వడానికి వచ్చానని చెప్పారు. 

More Telugu News