Rahul Gandhi: బాబు వస్తే జాబు వస్తుందని చంద్రబాబు చెప్పారు.. మేమెప్పుడూ చెప్పలేదు: కేటీఆర్

  • చార్మినార్ వద్ద రాహుల్ సద్భావన యాత్ర చేయడం దారుణం
  • గతంలో పాత బస్తీలో కాంగ్రెస్ నేత మతకల్లోలాలను సృష్టించారు
  • రోశయ్యకు రాజీవ్ సద్భావన అవార్డు ఇవ్వడం హాస్యాస్పదం

ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని... అలాంటి మాటలు తాము ఎప్పుడూ చెప్పలేదని వ్యాఖ్యానించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈరోజు విమర్శించిన సంగతి తెలిసింది. రాహుల్ విమర్శలపై స్పందిస్తూ కేటీఆర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.

రుణమాఫీ విషయంలో కర్ణాటక అనుసరిస్తున్నది తెలంగాణ నమూనానే అని కేటీఆర్ అన్నారు. మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగానే చూస్తోందని మండిపడ్డారు. చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ సద్భావన యాత్ర చేయడం దారుణమని... గతంతో ముఖ్యమంత్రిగా ఉన్న మర్రి చెన్నారెడ్డిని దింపడానికి... ఆ పార్టీకే చెందిన మరో నేత పాతబస్తీలో మతకల్లోలాలను సృష్టించారని విమర్శించారు. తమ దృష్టిలో మోదీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఒకటేనని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీలేనని అన్నారు.

50 ఏళ్ల కాంగ్రెస్ అసమర్థతతోనే గల్ఫ్ దేశాలకు వలసలు పెరిగాయని కేటీఆర్ విమర్శించారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ను అడ్డుకున్నది కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కర్ఫ్యూ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాదులో నాలుగు సార్లు కర్ఫ్యూ విధించారని... అలాంటి వ్యక్తికి రాజీవ్ సద్భావన అవార్డు ఇవ్వడం హాస్యాస్పదమని చెప్పారు. 

More Telugu News