rahul gandhi: రాహుల్ గాంధీ మరో అబద్ధం చెప్పారు: కర్నె ప్రభాకర్

  • ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదు
  • అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించినంతగా మరెవరూ అవమానించలేదు
  • కర్ణాటకలో రుణమాఫీ జరిగిందని రాహుల్ మరో అబద్ధం చెప్పారు

తెలంగాణలో నిర్వహించిన బహిరంగసభల్లో కనీస అవగాహన కూడా లేకుండా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మాట్లాడారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతల మాటలు వింటుంటే అబద్ధాల కంటే ముందే వీరు పుట్టారని అనిపిస్తోందని చెప్పారు. అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ నేతలకు మాస్టర్స్ డిగ్రీ ఇవ్వొచ్చని అన్నారు. రాహుల్ గాంధీ చెప్పిన అబద్ధాలను విని తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. పార్లమెంటులో కౌగిలింతలు, కన్నుకొట్టడాల మాదిరే తెలంగాణలో రాహుల్ సభలు సాగాయని అన్నారు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని కర్నె అన్నారు. డిసెంబర్ నాటికి 94 వేల ఉద్యోగాల నియామకాలు పూర్తవుతాయని చెప్పారు. ఇప్పటికే 68 వేల ఉద్యోగాల నియామకం పూర్తయిందని తెలిపారు. ఉద్యోగాలు వచ్చిన వారిని కలిస్తే, నిజాలు తెలుస్తాయని చెప్పారు. కోటి ఎకరాలకు నీరు అందించే కార్యక్రమం కొనసాగుతోందని... ఇప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించినంతగా మరెవరూ అవమానించలేదని చెప్పారు. కర్ణాటకలో రైతు రుణమాఫీ జరిగిందని రాహుల్ మరో అబద్ధం చెప్పారని... కాంగ్రెస్ నేతలకు విమాన టికెట్లు బుక్ చేస్తామని, బెంగళూరుకు వెళ్లి అక్కడ రుణమాఫీ జరిగిందో, లేదో తెలుసుకోవాలని అన్నారు. 

More Telugu News