rahul gandhi: తెలంగాణలో ప్రతి ఒక్కరిపై రూ. 60 వేల అప్పు ఉంది: రాహుల్ గాంధీ

  • కుటుంబ పాలనను కేసీఆర్ విజయవంతంగా అమలు చేశారు
  • టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైంది
  • గల్ఫ్ లో ఉండే వారిని కూడా కేసీఆర్ మోసం చేశారు

ధనిక రాష్ట్రమైన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులపాలు చేశారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. కామారెడ్డి బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ... తెలంగాణలోని ప్రతి ఒక్క వ్యక్తిపై రూ. 60 వేల అప్పు ఉందని అన్నారు. రైతులకు, విద్యకు, వైద్యానికి డబ్బులు ఇవ్వని కేసీఆర్... రూ. 300 కోట్లు ఖర్చు చేసి తన కోసం ప్యాలెస్ ను కట్టుకున్నారని మండిపడ్డారు. వంద రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన కేసీఆర్ హామీ ఏమయిందని ప్రశ్నించారు. హామీలను అమలు చేయలేని కేసీఆర్... కుటుంబ పాలనను మాత్రం విజయవంతంగా అమలు చేశారని చెప్పారు. ప్రధాని మోదీపై ఒత్తిడి తెచ్చి పసుపు బోర్డును తెచ్చుకోలేకపోయారని ఎద్దేవా చేశారు.

రూ. 35 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుల ఖర్చును రీడిజైన్ పేరుతో రూ. లక్ష కోట్లకు పెంచారని రాహుల్ విమర్శించారు. ప్రధాని మోదీ చేస్తున్న ప్రతి పనికి కేసీఆర్ మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. తెలంగాణలో పాలన దేశానికి రోల్ మోడల్ గా ఉంటుందని భావించామని, అవినీతి రహితమైన పాలన ఉంటుందని అనుకున్నామని... కానీ, టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలయిందని అన్నారు. నాలుగున్నరేళ్ల పాటు కేసీఆర్ అవినీతి పాలన కొనసాగించారని చెప్పారు. ఖమ్మం రైతులకు కేసీఆర్ బేడీలు వేయించారని మండిపడ్డారు.

గల్ఫ్ లో ఉన్న వారిని కూడా కేసీఆర్ మోసం చేశారని... గల్ఫ్ బాధితుల కోసం రూ. 500 కోట్లతో నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి, మాట తప్పారని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి కలను నెరవేర్చేది కాంగ్రెస్ మాత్రమేనని చెప్పారు. తప్పుడు మాటలను నమ్మాలనుకుంటే మోదీ, కేసీఆర్ పక్షానే ఉండమని చెప్పారు. సత్యం నిలబడాలంటే కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News