Congress: టీఆర్ఎస్ నేతలు ఊరిలోకి రాకుండా పొలిమేరల నుంచే తరిమికొట్టాలి!: కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్

  • కాంగ్రెస్ కు ప్రజల నుంచి సానుకూల స్పందన
  • కేసీఆర్, కేటీఆర్ ఇది తట్టుకోలేకపోతున్నారు
  • వచ్చే ఎన్నికల్లో 80కిపైగా సీట్లు సాధిస్తాం

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కామారెడ్డిలో పాల్గొనే సభలో రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న గల్ఫ్ కార్మికుల ఇబ్బందులు, బీడీ కార్మికుల సమస్య, సాగునీటి ఇబ్బందులను ప్రస్తావిస్తామని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీనియర్ నేత షబ్బీర్ అలీ నేతృత్వంలో ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే సభకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేశామని వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్లడం తట్టుకోలేకే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ రోజు కామారెడ్డిలో సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. తాము ప్రకటించిన మేనిఫెస్టోనే టీఆర్ఎస్ కాపీ కొట్టిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీనే తొలుత మేనిఫెస్టో ప్రకటించిందని అనుకుంటే.. ‘మేనిఫెస్టో అమలు చేయాలంటే 5 రాష్ట్రాల బడ్జెట్ కావాలి’ అంటూ కేటీఆర్ ఎందుకు చెప్పారని పొన్నం ప్రశ్నించారు.

2004, 2009లో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసిందని గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల సందర్భంగా ప్రచారానికి వచ్చే టీఆర్ఎస్ నేతలను ఊరి పొలిమేరల నుంచే తరిమేయాలని పిలుపునిచ్చారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మూడెకరాల సాగుభూమి, ఇంటింటికి మంచినీరు సహా ఇచ్చిన ఏ హామీని టీఆర్ఎస్ ప్రభుత్వం నిలబెట్టుకోలేదని పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో 80 సీట్లకు పైగా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను బొందపెడతామని పొన్నం అన్నారు.

More Telugu News