Andhra Pradesh: ఏడు సార్లు రిపోర్టులు ఇచ్చినా కడప స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయలేదు!: సుజనా చౌదరి ఆవేదన

  • టీడీపీ నేతలు లక్ష్యంగా ఐటీ దాడులు
  • 48 గంటల్లో మరోసారి నివేదిక ఇస్తాం
  • ఐటీ దాడులకు భయపడబోం

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా ప్రతిపాదనలు సమర్పించలేదని కేంద్రం చెప్పడం హాస్యాస్పదమని టీడీపీ నేత సుజనా చౌదరి తెలిపారు. తాము అన్ని వివరాలను ఇచ్చినా కేంద్ర ఉక్కు మంత్రి మాత్రం ఇవ్వలేదని చెబుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు, వ్యాపార సంస్థలు లక్ష్యంగా జరుగుతున్న ఐటీ దాడులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఈ రోజు అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో సుజనా మాట్లాడారు.

ఐటీ అధికారులు వస్తుంటారు, పోతుంటారనీ, వాళ్లు తమనేం చేయలేరని సుజనా చౌదరి స్పష్టం చేశారు. 3 మిలియన్ టన్నుల ఉత్పాదక ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కావాల్సిన సమగ్ర ప్రతిపాదనలను కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు సాయం చేయడం ఇష్టం లేని కేంద్రం కుంటిసాకులు చెబుతోందని దుయ్యబట్టారు.

ఎన్టీయే ప్రభుత్వం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ కేంద్రం చేస్తోందని ఆరోపించారు. ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఏడుసార్లు సమగ్ర వివరాలు అందించామన్నారు. 48 గంటల్లో మరోసారి కడప స్టీల్ ఫ్యాక్టరీ ప్రాజెక్టుకు సంబంధించి సమగ్ర వివరాలు అందజేస్తామన్నారు. ఇప్పటికైనా కేంద్రం కక్ష సాధింపు చర్యలను మానుకుని స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విషయంలోనూ కేంద్రం తీరు ఏమాత్రం మారలేదని దుయ్యబట్టారు.

More Telugu News