Punjab: ప్రమాద సమయంలో రైలు వేగం 70 కిలోమీటర్లు.. వెళ్లాల్సిన వేగం 32 కిలోమీటర్లు.. ఏం జరిగింది?

  • పంజాబ్ రైలు ప్రమాద ఘటనకు బోలెడు కారణాలు
  • 15 సెకన్లలో లెవల్ క్రాసింగ్‌ను దాటేసిన రైలు
  • మెదళ్లను తొలిచేస్తున్న చిక్కు ప్రశ్నలు

పంజాబ్‌లో గత సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదం వెనక తరచి చూస్తే బోలెడన్ని కారణాలు కనిపిస్తున్నాయి. సెల్ఫీల పిచ్చి, బాణసంచా హోరు, రైల్వే ట్రాక్‌ సమీపంలో రావణ వధ, చెవులు చిల్లులు పడేలా మైకు శబ్దాలు.. ఇలా అన్నీ కారణమయ్యాయి. తాజాగా మరో విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రమాదానికి కారణమైన డీఎంయూ రైలు ఆ సమయంలో ఏకంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నిజానికి దీని నిర్దేశిత వేగం 32 కిలోమీటర్లు మాత్రమే. ఇది హోషియాపూర్-అమృత్‌సర్ మధ్య నడుస్తుంది. మొత్తం దూరం 121 కిలోమీటర్లు. మొత్తం ప్రయాణ దూరం 3:45 గంటలు. 16 హాల్టులున్నాయి. నిజానికి లెవల్ క్రాసింగుల వద్ద రైలు వేగం తక్కువగా ఉంటుంది. ఎక్స్‌ప్రెస్ రైళ్లు తప్ప మిగతావన్నీ స్పీడు తగ్గించాల్సిందే. ఇన్ని నిబంధనలు ఉన్నప్పుడు ప్రమాదానికి కారణమైన ఆ రైలు అంత వేగంగా ఎందుకు వెళ్లిందన్నది చిక్కుప్రశ్నగా మారింది. కేవలం 15 సెకన్లలోనే రైలు లెవల్ క్రాసింగ్‌ను దాటిందంటే ఎంత వేగంతో ప్రయాణిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

రైలు ప్రయాణ మార్గంలో దసరా ఉత్సవాలు జరుగుతున్న సంగతి రైలు లోకో పైలట్‌కు తెలియదా? ముందు స్టేషన్‌లో వారిని అప్రమత్తం చేయలేదా? వేడుకలు పూర్తయ్యేంత వరకు రైలును నిలిపివేసే అవకాశం ఉన్నా ఆ పని ఎందుకు చేయలేదు? అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లను తొలిచేస్తున్నాయి.

More Telugu News