Odisha: తిత్లీ ఎఫెక్ట్.... కుమార్తె మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కిలోమీటర్లు నడిచిన తండ్రి!

  • కొండచరియలు విరిగిపడి బాలిక మృతి
  • మూడు రోజుల తరువాత కనిపించిన మృతదేహం
  • పోస్టుమార్టం జరిపిస్తేనే సాయం అందుతుందన్న పోలీసులు
  • శవాన్ని భుజాన వేసుకుని నడిచిన పేద తండ్రి

తన కుమార్తె ప్రాణాలు వదిలితే, పోస్టుమార్టం కోసం తండ్రి ఆ మృతదేహాన్ని భుజాన వేసుకుని 8 కిలోమీటర్లు నడిచిన హృదయవిదారక ఘటన ఒడిశాలోని లక్ష్మీపురం సమీపంలో చోటు చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలను వణికించిన తిత్లీ తుపాను సమయంలో అతంక్ పూర్ గ్రామానికి చెందిన ముకుంద్ కుమార్తె బబిత (7) అదృశ్యమైంది. కొండచరియలు విరిగిపడగా, ఆమె మరణించిందన్న విషయం గురువారం నాడు పోలీసులు ముకుంద్ కు చేరవేశారు.

ఇక మృతదేహాన్ని ఆయనకు అప్పగించిన పోలీసులు, పోస్టుమార్టం జరిపిస్తేనే, రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారం అందుతుందని చెప్పారు. దీంతో వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లేంత డబ్బులేని ఆ తండ్రి, నడక ప్రారంభించాడు. ఓ సంచిలో మృతదేహాన్ని ఉంచి, తన భుజంపై వేసుకుని నడుస్తుండగా, ఎనిమిది కిలోమీటర్ల తరువాత విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వారు ఓ ఆటోను పంపించి మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సహకరించారు. గజపతి జిల్లా మహేంద్రగిరి వద్ద కొండచరియలు విరిగిపడి, ఆ బాలిక ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ధ్రువీకరించారు.

More Telugu News