Pune: వైద్య శాస్త్రంలో మరో అద్భుతం... తల్లి పుట్టిన గర్భసంచీ నుంచే బిడ్డ కూడా..!

  • పుణె వైద్యుల అరుదైన శస్త్రచికిత్స
  • గర్భసంచి లేని మహిళకు ఆమె తల్లి నుంచి గర్భసంచి
  • గర్భం దాల్చిన మహిళ, పండంటి శిశువు జననం

భారత వైద్య చరిత్రలో మరో అద్భుతాన్ని చేసి చూపించారు పుణె వైద్యులు. గర్భసంచి మార్పిడి అనంతరం ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చిన అరుదైన ఘటనలో ఆ గర్భసంచి ఆమె తల్లిదే కావడం గమనార్హం. నగరంలోని గెలాక్సీ కేర్ ఆసుపత్రిలో ఈ అద్భుతం జరిగింది. తల్లి జన్మించిన గర్భసంచీ నుంచే ఆమె బిడ్డ పుట్టడం ఆసియాలో ఇదే తొలిసారి.

ఆసుపత్రి వైద్యులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, గుజరాత్‌ కు చెందిన మీనాక్షి అనే మహిళకు, గర్భసంచి లేకపోవడం వల్ల ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఆమె బాధను చూడలేకపోయిన తల్లి, గర్భసంచి దానానికి ముందుకు రాగా, 9 గంటల శస్త్రచికిత్స అనంతరం తల్లి గర్భసంచిని బిడ్డకు అమర్చారు. ఆపై కొన్ని నెలల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచి, ఆరోగ్యం మెరుగుపడిందన్న తరువాత, ఆమెను డిశ్చార్జ్ చేశారు.

ఈ సంవత్సరం ప్రారంభంలో ఆమె గర్భం ధరించి, తిరిగి ఆసుపత్రికి రాగా, 32 వారాల 5 రోజుల తరువాత సిజేరియన్ చేసి, పాపను బయటకు తీశారు. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని ఈ అరుదైన చికిత్సలో భాగం పంచుకున్న డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ నేతృత్వంలోని వైద్య బృందం వెల్లడించింది.

More Telugu News