kadapa: కడప ఉక్కు కర్మాగారంపై కదలిక.. నివేదిక సమర్పించాలన్న కేంద్ర ఉక్కు శాఖ

  • మెకాన్ సంస్థ, టాస్క్ ఫోర్స్ తో ఉక్కు మంత్రి సమీక్ష
  • వివిధ అంశాలపై చర్చ
  • ఏపీకి ఉక్కు ఫ్యాక్టరీ ఎంతో అవసరమంటూ వ్యాఖ్య

కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశంపై కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన టాస్క్ ఫోర్స్ తో కేంద్ర ఉక్కు శాఖ ఈరోజు సమీక్ష నిర్వహించింది. ఏపీ ప్రభుత్వం నుంచి వీలైనంత త్వరగా వివరాలను సేకరించాలని మెకాన్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల కోసం వేచి చూడకుండా... మిగిలిన అంశాలతో రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది.

గనుల లీజు, ముడి ఇనుము లభ్యత తదితర అంశాలపై త్వరగా నివేదిక అందించాలని కేంద్ర ఉక్కు మంత్రి బీరేంద్ర సింగ్ ఆదేశించారు. ప్రభుత్వ లేదా ప్రవేటు లేదా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పరిశ్రమ ఏర్పాటు అవకాశాలపై సమావేశంలో చర్చించారు.

ఇప్పటికే డ్రాఫ్ట్ రిపోర్టును ఉక్కు శాఖకు అధికారులు సమర్పించారు. రెండు అంశాలపై ఏపీ ప్రభుత్వం నుంచి సమాచారం రావాల్సి ఉందని ఈ సమావేశం సందర్భంగా మెకాన్ సంస్థ తెలిపింది. మెకాన్ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయం తీసుకుంటుందని ఉక్కు శాఖ చెప్పింది. ఏపీ అభివృద్ధికి ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఎంతో అవసరమని తెలిపింది. 

More Telugu News