Kerala: శబరిమలపై తీర్పును కొట్టివేయండి.. పిటిషన్ దాఖలు చేసిన కేరళ బ్రాహ్మణ సభ!

  • గతంలో ఇచ్చిన తీర్పు తప్పుల తడకగా ఉంది
  • నిజమైన భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది
  • వార్తా కథనం ఆధారంగా తీర్పు ఇచ్చేశారు

శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును కొట్టివేయాలని కేరళ బ్రాహ్మణ సభ డిమాండ్ చేసింది. గతంలో ఇచ్చిన తీర్పును తిరస్కరించాలని కోరుతూ ఈ రోజు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు తప్పుల తడకగా ఉందనీ, నిజమైన అయ్యప్ప భక్తులను ఆందోళనకు గురిచేస్తోందని పేర్కొంది. న్యాయవాది సనంద్ రామకృష్ణన్ కేరళ బ్రాహ్మణ సభ తరఫున పిటిషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా రామకృష్ణన్ మాట్లాడుతూ.. 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళలపై అయ్యప్ప ఆలయంలో కొనసాగుతున్న నిషేధానికి రివ్యూ పిటిషనర్లతో పాటు, మహిళా భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు. తీర్పు సమయంలో కోర్టు కోట్లాది మంది అయ్యప్ప భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు. మహిళల ప్రవేశంపై వయో పరిమితులు ఎందుకు కొనసాగుతున్నాయనే చారిత్రక అవగాహన లేకుండా, లింగ వివక్షకు ముడిపెడుతూ రాసిన ఓ వార్తా కథనం ఆధారంగా కోర్టు తీర్పు ఇచ్చిందని వెల్లడించారు. ఇప్పటికైనా గతంలో ఇచ్చిన తీర్పును పరిశీలించి కొట్టివేయాలని కోరారు.

More Telugu News