Dasara: పెళ్లికి ముందు కన్యత్వ పరీక్షకు అంగీకరించని యువతికి దాండియా నుంచి బహిష్కరణ శిక్ష!

  • కంజారభట్ కమ్యూనిటీలో కన్యత్వ పరీక్ష తప్పనిసరి
  • అనాచారమంటూ నిరాకరించిన ఐశ్వర్యా తమైచికర్
  • దసరా వేడుకలకు రావద్దని హుకుం

పెళ్లికి ముందు కన్యత్వ పరీక్షను జరిపించుకునేందుకు అంగీకరించని ఓ యువతిని దసరా సందర్భంగా జరిపే దాండియా వేడుక నుంచి పుణెకు చెందిన ఓ కులసంఘం బహిష్కరించింది. ఈ విషయమై బాధితురాలు ఐశ్వర్యా తమైచికర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, పుణె ప్రాంతంలో ఉండే కంజారభట్ కమ్యూనిటీలో వివాహానికి ముందు వర్జినిటీ పరీక్షలు తప్పనిసరి. ఆమె తన పెళ్లికి ముందు కన్యత్వ పరీక్షలకు అంగీకరించకుండానే పెళ్లి చేసుకుంది. దీంతో ఆ వర్గం ఆమెను దాండియాలో పాల్గొనకుండా నిషేధించింది. ఈ విషయాన్ని పింప్రి-చించ్ వాడ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఐశ్వర్య, కంజారభట్ తెగకు తాను చెడ్డపేరు తెచ్చానని ఆరోపిస్తూ, నిత్యమూ తనను వేధిస్తున్నారని తెలిపింది.

కాగా, ఐశ్వర్య భర్త వివేక్ మాత్రం భార్యకు అండగా నిలుస్తున్నాడు. గతంలో ఈ కన్యత్వ పరీక్షలకు వ్యతిరేకంగా తాను పోరాడానని, అయితే, ఈ దురాచారం ఇంకా తమవారిలో సాగుతోందని అన్నాడు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా నిషేధించడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పాడు.

బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు సామాజిక బహిష్కరణ చట్టం 2016 ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఆమె ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని స్థానిక డీసీపీ తెలిపారు.

More Telugu News