Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాకు మరో ముప్పు.. ‘గజ’గజ లాడించనున్న తుపాను!

  • ఈ నెల 23న ఏర్పడే అవకాశం
  • నాలుగు రోజుల ముందు స్పష్టత
  • వాతావరణ శాఖ బులెటిన్ విడుదల

తిత్లీ తుపాను దెబ్బకు శ్రీకాకుళం జిల్లాలో పెను విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఎకరాల్లో అరటి, జీడి మామిడి పంటలతో పాటు కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు మరోసారి తుపాను ప్రమాదం ఉందని వార్తలు రావడంపై జిల్లా వాసులు వణికిపోతున్నారు. ఈ నెల 23న ఉత్తర అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతం వద్ద అల్పపీడనం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

దీనిపై స్పష్టత రావాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందేనని వెల్లడించింది. ఈ మేరకు ఓ బులెటిన్ ను విడుదల చేసింది. అల్పపీడనం తొలుత బలపడి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారినప్పుడే దాని గమనం తెలుస్తుందని వాతావరణశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోసారి బంగాళాఖాతంలో తుపాను వస్తే దానికి ‘గజ’ అని పేరు పెడతామని వెల్లడించారు. తుపాను ఏర్పాటుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనీ, అయితే అప్పుడే ప్రజల్లో తుపాను గురించి వదంతులు రెచ్చగొట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.

More Telugu News