Chittoor District: చిత్తూరులో విమానం కూలిందంటూ వైరల్ న్యూస్... అసలేం జరిగిందంటే..!

  • విద్యుత్ లైన్ పై పడిన పిడుగు
  • మంటలు చెలరేగడంతో వదంతులు
  • స్వయంగా రంగంలోకి దిగిన చిత్తూరు ఎస్పీ
  • తప్పుడు వార్తలని ధ్రువీకరణ

చిత్తూరు నగరంలోని సత్యనారాయణపురంలో ఓ విమానం కూలిందన్న వార్తలు బుధవారం నాడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందుకు తగ్గట్టుగానే దూరం నుంచి పెద్దఎత్తున మంటలు చెలరేగడంతో ఈ వార్త దావానలంలా వ్యాపించింది. వందలాది మంది అక్కడికి చేరి, ఏం జరిగిందంటూ ఆరా తీశారు.

విషయం విన్న ఎస్పీ ఎస్వీ రాజశేఖరబాబు, తన బృందాలను అప్రమత్తం చేస్తూ, ఘటనాస్థలికి వచ్చారు. ఇదే సమయంలో ఆయన స్వయంగా తిరుపతి ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను సంప్రదించగా, అటువంటి ప్రమాదం జరగలేదన్న సమాచారం వచ్చింది. ఆ వెంటనే అదే విషయాన్ని ఆయన స్థానికులకు చేరవేసి, ప్రజలను అక్కడి నుంచి పంపించారు.

ఇంతకీ జరిగింది ఏంటంటే, నిన్న రాత్రి చిత్తూరులో పిడుగులతో కూడిన భారీ వర్షం కురవగా, 33 కేవీ లైన్ పై ఓ పిడుగు పడింది. సమీపంలో ఉన్న ఓ చిన్న కొండపై మరో పిడుగు పడి, పేలుడు వంటి శబ్దం వచ్చింది. పేలుడు శబ్దాన్ని విని, విద్యుత్ లైన్ తెగిపడగా, వచ్చిన మంటలు చూసిన కొందరు విమానం కూలినట్టు భావించి, ఆ సమాచారాన్ని వైరల్ చేశారు. చివరకు అటువంటిదేమీ లేదని ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News