Bharata Natyam: భరతనాట్యంలోనూ కీచకులు... లైంగికంగా వేధించారంటున్న కళాకారిణులు!

  • కర్ణాటక సంగీత విధ్వాంసుల్లో కీచకులు
  • లైంగిక వేధింపులు సాధారణమంటున్న కళాకారిణులు
  • నిజమేనన్న బాంబే జయశ్రీ, సుధా రఘునాధన్, టీఎం కృష్ణ

పెట్టుకునేది నుదుటన విభూతి, కట్టుకునేది సిల్క్ పంచె, చేసే పనులు మాత్రం... తన వద్దకు వచ్చిన శిష్యురాళ్లను లైంగికంగా లొంగదీసుకోవడమే... భక్తిమాటున దాగిన రాక్షసులు భరతనాట్యం, శాస్త్రీయ సంగీతంలోనూ ఉన్నారని ఏడేళ్ల క్రితం ఓ ప్రముఖ సంగీత విద్వాంసుడి చేతుల్లో అత్యాచారానికి గురైన క్రీడాకారిణి ఒకరు సంచలన ఆరోపణలు చేశారు.

పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆమె, భక్తి మాటున దాగిన రాక్షసులు వీరని ఆరోపించారు. 'మీటూ' ఉద్యమంలో భాగమయ్యేందుకు కర్ణాటక సంగీతం, భరత నాట్య రంగాల్లో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వారంతా ముందుకు రావాలని సుమారు 200 మంది కళాకారిణుల సంతకాలతో మీడియాకు ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆమె స్పందించారు.

 సైబర్ సెక్స్ అంటే నీకు ఇష్టమా? నీ తోటి కళాకారుడితో వెళ్లకుంటే, వేదికపై సరిగ్గా నాట్యం చేయలేవు... వంటి మాటలు తాను చెవులారా విన్నానని, తన గురువు బలవంతం చేస్తున్నాడని వచ్చి విలపిస్తూ, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం తనకు గుర్తుందని ఆమె అన్నారు. కాగా, పలువురు కళాకారిణులు, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల్లో తమ అనుభవాలు షేర్ చేసుకుంటున్నారు. 'మీటూ' ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ నెల 21న చెన్నైలో 'బహిరంగ విచారణ - సంప్రదింపులు' పేరిట ఓ కార్యక్రమం నిర్వహించనున్నట్టు సాంస్కృతిక సంస్థ ఒకటి ప్రకటించింది.

ఇదిలావుండగా, భారత శాస్త్రీయ కళా రంగంలో లైంగిక వేధింపులు సాధారణమేనని, ఇవన్నీ బహిరంగ రహస్యమేనని ప్రముఖ కర్ణాటక సంగీత గాత్ర విధ్వాంసుడు టీఎం కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటి గురించి తాను ఎప్పటి నుంచో వింటున్నానని, వాటంతట అవే సర్దుకుపోవాలని ఆశించి, పలువురం మౌనంగా ఉన్నామని అన్నారు. గతంలో తాము మహిళలను దూషించినందుకు సిగ్గుపడుతున్నామని, వారి పక్షాన అప్పట్లో నిలవలేక పోయామని తెలిపారు. సంగీత విధ్వాంసులను దైవ స్వరూపులుగా, గురువులుగా భావించడాన్ని మానుకోవాలని సూచించారు.

ఈ రంగాల్లో అగ్రవర్ణాలు, పురుషుల ఆధిపత్యం కొనసాగుతుండటంతోనే లైంగిక దాడులు అధికంగా ఉన్నాయని ప్రముఖ గాయని సుధా రఘునాథన్ తెలిపారు. లైంగిక దాడులు, లొంగదీసుకోవడాలు చాలా సాధారణమని కర్ణాటక సంగీత ప్రపంచానికి తెలుసునని గాయని బాంబే జయశ్రీ వ్యాఖ్యానించారు. తాను కూడా ఇటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని అన్నారు. స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడాల్సిన సమయం వచ్చిందని, అందరి గురించి ఆలోచించి, అడుగేయాల్సిన సమయం ఇదేనని ఆమె అన్నారు.

More Telugu News