Chandrababu: ముఖ్యమంత్రి హుందాగా ఉండాలి.. ఆ నీచమైన భాషేంటి?: కేసీఆర్ పై సోమిరెడ్డి మండిపాటు

  • ఎందుకంత నోరుపారేసుకోవడం?
  • ప్రజల్లో కేసీఆర్ చులకనైపోతున్నారు
  • ‘ముందస్తు’కు వెళ్లిన వారెవ్వరూ సక్సెస్ కాలేదు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న కేసీఆర్ హుందాగా వ్యవహరించాల్సింది పోయి.. నీచమైన భాష మాట్లాడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లిన వారెవ్వరూ సక్సెస్ కాలేదని, మహాకూటమిని చూసి కేసీఆర్ కు భయం పట్టుకుందని, అందుకే, ఆందోళనలో ఉన్న ఆయన తన ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

 'ఎందుకంత నోరుపారేసుకోవడం? చంద్రబాబునాయుడుపై మీరు ఉపయోగించే భాష గురించి మీ కుటుంబంలోని మనవళ్లకు చెప్పండి, వాళ్లు ఒప్పుకుంటారేమో? ఇది చాలా దురదృష్టం. అయినా కేసీఆర్ గురించి ఎక్కువ మాట్లాడటం అనవసరం' అన్నారు. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత మన గురించి పది మంది మాట్లాడుకునేలా మనం మిగిలిపోవాలని, ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారని, ఇంత దిగజారి ప్రవర్తిస్తారని అనుకోలేదని అన్నారు. ‘కేసీఆర్ మేధావి’ అనే అభిప్రాయాన్ని ఇలాంటి మాటలు మాట్లాడి ఆయనే స్వయంగా పోగొట్టుకుంటున్నారని, ప్రజల్లో చులకనైపోతున్నారని అన్నారు.

More Telugu News