brazil: గుండెలపై చిన్నారిని ఉంచిన డాక్టర్లు.. ఒక్కసారిగా కోమా నుంచి బయటపడ్డ తల్లి!

  • బ్రెజిల్ లోని ఫోర్టాలెజాలో ఘటన
  • మూర్ఛవ్యాధితో కోమాలోకి వెళ్లిపోయిన అమండ
  • ప్రసవం అనంతరం పిల్లాడు తాకడంతో స్పృహలోకి

తల్లి స్పర్శ బిడ్డకు తెలిసిపోతుందని చాలామంది చెబుతుంటారు. ఎంతమంది ఎత్తుకుని లాలించినా ఆగని చిన్నారి ఏడుపు, తల్లి హత్తుకోగానే ఒక్కసారిగా ఆగిపోవడాన్ని మనం చూసుంటాం. తాజాగా దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్ లో అంతకు మించిన అద్భుత ఘటన చోటుచేసుకుంది. ప్రసవానికి కొన్నిరోజుల ముందు కోమాలోకి వెళ్లిపోయిన ఓ తల్లి, తన కుమారుడి స్పర్శ తగలగానే ఒక్కసారిగా స్పృహలోకి వచ్చేసింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో ఆనందాలు రెట్టింపయ్యాయి.

బ్రెజిల్ లోని ఫోర్టాలెజా ప్రాంతంలో అమండా డిసిల్వా(28) తన భర్తతో కలిసి ఉంటోంది. ఈ దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న అమండా డెలివరీకి రెండు వారాల ముందు కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో 9 నెలలు పూర్తయ్యాక వైద్యులు సిజేరియన్ నిర్వహించి చిన్నారిని బయటకు తీశారు.

తొలుత శిశువుకు వైద్యం అందించిన డాక్టర్లు తర్వాత ఆ బిడ్డను తల్లి అమండా గుండెలపై ఉంచారు. దీంతో కన్నబిడ్డ తాకిన కొద్దిసేపటికే అమండా మెలకువలోకి వచ్చింది. కాగా, ఈ సందర్భంగా అమండా మాట్లాడుతూ.. తనకు డెలివరీ ఎలా జరిగిందో తెలియదని చెప్పింది. నవజాత శిశువుకు విక్టర్ గా పేరు పెట్టినట్లు వెల్లడించింది.

More Telugu News