Uttar Pradesh: జల్సాలకు మరిగి కిడ్నాప్ డ్రామా.. 11 ఏళ్ల పిల్లాడి చేష్టలతో తలపట్టుకున్న పోలీసులు!

  • ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో ఘటన
  • జల్సాలకు అలవాటు పడ్డ బాలుడు
  • పిల్లాడిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

సినిమాలు పిల్లలను చెడగొట్టడం అంటే ఇదే. జల్సాలకు అలవాటు పడిన ఓ పిల్లాడు తండ్రికి ప్రాంక్ కాల్ చేశాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారనీ, భారీగా డబ్బు తీసుకొచ్చి కాపాడాలని కోరాడు. దీంతో తండ్రి పోలీసులను ఆశ్రయించగా, అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నోయిడాలోని చిహ్ జార్సీ ప్రాంతంలో ఉంటున్న బాలుడు(11) జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో అతను తండ్రి కిరాణా షాపులో డబ్బులు దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. అయితే సోమవారం ఉదయం కూడా రూ.100 తీసినట్లు తేలడంతో ఇంట్లోవాళ్లు తిట్టారు. దొంగలించిన డబ్బులతో బిస్రాక్ అనే ప్రాంతానికి వెళ్లిన సదరు బాలుడు ఎంజాయ్ చేశాడు. చివరికి డబ్బులు అయిపోగా, అతనికి అద్భుతమైన ఐడియా తట్టింది.

వెంటనే దారిన వెళుతున్న ఓ వ్యక్తి ఫోన్ అడిగి తీసుకున్నాడు. తండ్రికి ఫోన్ చేసి ‘నాన్న .. నన్ను కిడ్నాప్ చేశారు. 5 నిమిషాల్లోగా రూ.5 లక్షలు తీసుకుని రావాలని చెబుతున్నారు. నన్ను కాపాడు’ అని ఫోన్ లో ఏడుస్తూ చెప్పాడు. కంగారుపడ్డ సదరు తండ్రి పోలీసులను ఆశ్రయించారు.

దీంతో ఫోన్ నంబర్ ను నిమిషాల్లో ట్రేస్ చేసిన అధికారులు.. సదరు వ్యక్తిని పట్టుకోగా, ఇంటికి ఫోన్ చేయాలంటూ ఓ పిల్లాడు మొబైల్ అడిగాడని చెప్పాడు. దీంతో విస్తుపోవడం అధికారుల వంతయింది. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయని పోలీస్ అధికారులు.. పిల్లాడిని అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

More Telugu News