Andhra Pradesh: జీవీఎల్ ను ఆంధ్రాపై ఆంబోతులా వదిలారు!: సీఎం రమేశ్ విమర్శ

  • ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారు
  • చంద్రబాబు కారణంగానే రాష్ట్రానికి ఐటీ కంపెనీలు
  • బీజేపీకి ఒక్క ఓటు కూడా రాదు

బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ నాయకుడు సీఎం రమేశ్ విమర్శలు గుప్పించారు. జీవీఎల్ ను బీజేపీ అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్ పై ఆంబోతులా వదిలేసిందని విమర్శించారు. అందుకే జీవీఎల్ ఇష్టానుసారం టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

సీఎం చంద్రబాబు కృషి కారణంగానే రాష్ట్రానికి ఐటీ కంపెనీలు వస్తున్నాయని రమేశ్ తెలిపారు. కంపెనీలు పెట్టినందుకు ప్రజల సొమ్మును రాయితీల పేరుతో భారీగా దుర్వినియోగం చేసిందన్న జీవీఎల్ వ్యాఖ్యలను ఖండించారు. ఈరోజు ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ రమేశ్ బీజేపీపై నిప్పులు చెరిగారు.

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందనీ, ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వలేదని సీఎం రమేశ్ గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఒక్క ఓటు కూడా పడదని జోస్యం చెప్పారు. జీవీఎల్ అసలు అర్థం లేకుండా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని కోరినందుకే టీడీపీ నేతలు లక్ష్యంగా దాడులు కొనసాగాయని ఆరోపించారు.

More Telugu News