murder attempt: తల్లిపై హత్యాయత్నం చేసిన కొడుకుకి పదేళ్ల జైలు శిక్ష!

  • డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపాలనుకున్న కొడుకు
  • ఇటుకరాయితో తలపై మోదడంతో తీవ్రగాయాలు
  • బాధితురాలి కుమార్తె ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు

జల్సాలకు డబ్బులు ఇవ్వడం లేదన్న ఆక్రోశంతో తల్లిపై హత్యాయత్నం చేసిన కొడుకుకి కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే...వరంగల్‌ జిల్లా చింతల్ ప్రాంతానికి చెందిన పరిమళకాంత్‌ ఐటీఐ చేశాడు. ఏ పనీ చేయకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. ఇతని తల్లి అంకం సుశీల స్టాఫ్‌నర్స్‌గా పనిచేసి రిటైరయ్యారు. ఈమెకు కూతురు సుప్రియ కూడా ఉంది. నిత్యం మద్యం సేవిస్తూ తల్లిని డబ్బు కోసం పరిమళకాంత్‌ వేధిస్తుండేవాడు. డబ్బులు ఇవ్వకుంటే బలవంతంగా లాక్కునేవాడు.

ఈ నేపథ్యంలో ఇంటి మరమ్మతులు చేయాల్సి ఉండడంతో 2017 జూన్‌ 30న కూలీలను సమకూర్చుకుని వారిని ఆటోలో తీసుకుని సుశీల ఇంటికి వచ్చింది. డబ్బు ఇవ్వడం లేదన్న కోపంతో తల్లికోసం ఎదురు చూస్తున్న పరిమళకాంత్‌ ఆమె ఆటో దిగక ముందే ఇటుక రాయి తీసుకుని తలపై మోదాడు. పదేపదే ఆమెను కొడుతుండడంతో ఆటో డ్రైవర్‌తోపాటు ఆటోలో వచ్చిన కూలీలు అడ్డుకుని అరవడంతో పారిపోయాడు. ఈ ఘటనలో సుశీల తీవ్రంగా గాయపడింది. సుశీల కుమార్తె సుప్రియ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్యా యత్నం కేసు నమోదు చేశారు. కేసు విచారించిన న్యాయమూర్తి పదేళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.

More Telugu News