Telangana: ఆ బలిదానాలు చూడలేకపోయా.. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరా!: తాటికొండ రాజయ్య

  • రైతన్నల సంక్షేమం కోసమే ‘రైతు బంధు’
  • రాష్ట్రం అద్భుతంగా పురోగమిస్తోంది
  • జనగామ బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్య

రైతులను ఆదుకోవడానికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రైతు బంధు’ పథకాన్ని తీసుకొచ్చారని టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించి పిల్లలకు కులమతాలకు అతీతంగా ఉచిత విద్యను అందజేస్తున్నామని చెప్పారు. తెలంగాణ కోసం వేలాది మంది యువకులు ఆత్మబలిదానం చేశారన్నారు. ఆ త్యాగాలను చూడలేక కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరారన్నారు. జనగామ జిల్లాలోని కరుణాపురంలో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో రాజయ్య పాల్గొన్నారు.

తెలంగాణలో గత నాలుగున్నరేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని రాజయ్య అన్నారు. ఆసరా పెన్షన్లు, రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్లతో రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మార్చామన్నారు. కరుణాపురం అభివృద్ధి కోసం రూ.25 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గంలో ఈసారి లక్ష మెజారిటీ వచ్చేలా కార్యకర్తలు పనిచేయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పూర్తి సహకారం అందజేస్తున్నారని చెప్పారు.

More Telugu News