digvijay singh: నేను ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు ఓట్లు తగ్గిపోతాయి: దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

  • నాకు ఒక్క పని మాత్రమే ఉంది.. అది నో పబ్లిసిటీ, నో స్పీచెస్
  • ప్రతి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కార్యకర్తలు కృషి చేయాలి
  • కాంగ్రెస్-బీఎస్పీల మధ్య పొత్తు కుదరకపోవడానికి నేను కారణం కాదు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తాను ప్రసంగాలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఎవరికి టికెట్ వచ్చినా, మనకు నచ్చని వ్యక్తి అయినా సరే... వారు గెలిచేందుకు మనం కృషి చేయాలని చెప్పారు.

తనకు ఒక్క పని మాత్రమే ఉందని... అది నో పబ్లిసిటీ, నో స్పీచెస్ అని చెప్పారు. తాను ప్రసంగిస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్లను కోల్పోతుందని తెలిపారు. ఈ కారణం వల్లే ఎన్నికల ర్యాలీల్లో తాను పాల్గొనడం లేదని చెప్పారు. భోపాల్ లో పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ, ఆయన ఈమేరకు స్పందించారు. కాంగ్రెస్ తరపున రానున్న ఎన్నికల్లో నిలబడే ప్రతి అభ్యర్థి విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు కాంగ్రెస్ తో జతకట్టకుండా బీఎస్పీని అడ్డుకుంటున్నారంటూ ఇటీవల మాయావతి బహిరంగంగా విమర్శించిన సంగతి తెలిసిందే. మాయావతి వ్యాఖ్యలను ఈ సందర్భంగా డిగ్గీరాజా ఖండించారు. కాంగ్రెస్-బీఎస్పీల మధ్య పొత్తు కుదరకపోవడానికి తాను కారణం కాదని చెప్పారు. కేంద్రం నుంచి వస్తున్న ఒత్తిడి వల్లే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో బీఎస్పీ చేతులు కలపలేదని విమర్శించారు.

More Telugu News