Uttam Kumar Reddy: భారీ హామీలను ఎలా అమలు చేస్తారన్న ప్రశ్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం!

  • రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నెలకు రూ. 10,500 కోట్లు
  • నిరుద్యోగభృతికి ఏడాదికి రూ. 36 వేల కోట్లు ఖర్చవుతుంది
  • టీఆర్ఎస్ కు కాంట్రాక్టర్లు ముఖ్యం.. మాకు పేద ప్రజలు ముఖ్యం

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున హామీలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటి. ఇదే విషయంపై ఓ మీడియా సంస్థ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించింది. మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోతుందా? అని ప్రశ్నించింది. దీనికి సమాధానంగా... రాష్ట్ర ఖజానాలో సరిపడా డబ్బులు ఉన్నాయని ఉత్తమ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నెలకు రూ. 10,500 కోట్లు అని చెప్పారు.

10 లక్షల మందికి నిరుద్యోగభృతి ఇచ్చేందుకు నెలకు రూ. 3వేల కోట్ల చొప్పున ఏడాదికి రూ. 36 వేల కోట్లు అవుతుందని ఉత్తమ్ తెలిపారు. ఇది సాధ్యం కాని పనేమీ కాదని ఆయన చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని... దేశ వ్యాప్తంగా రైతులందరికీ రూ. 2 లక్షల ఏకకాల రుణమాఫీని యూపీఏ ప్రభుత్వమే అమలు చేస్తుందని తెలిపారు. ఆర్థిక నిపుణుల కమిటీ పరిశీలన తర్వాతే తాము హామీలను ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ కు కాంట్రాక్టర్లు ముఖ్యమని, తమకు పేద ప్రజలే ముఖ్యమని అన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షల కోట్లుగా ఉంటుందని చెప్పారు. 

More Telugu News