Kerala: నీలక్కల్ కు వేలాదిగా చేరుకుంటున్న కేరళ మహిళలు... ఎవరైనా వస్తే రెండుగా చీలుస్తామని హెచ్చరిక!

  • బుధవారం తెరచుకోనున్న అయ్యప్ప ఆలయం
  • 18 కిలోమీటర్లకు ముందే మహిళలను ఆపేస్తామంటున్న సంఘాలు
  • ఒక్కరిని కూడా పంబ వైపు వెళ్లనివ్వబోమంటున్న మహిళలు

రేపు శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు తెరచుకోనున్న నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏ వయసు మహిళలైనా ఆలయ ప్రవేశం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని భారతీయ ధర్మ జనసేన, శబరిమల భక్త సంఘాలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. పంబకు సుమారు 18 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ ప్రాంతంగా ఉండే నీలక్కల్ కు ఇప్పటికే చేరుకున్న వేలాది మంది మహిళలు, ఇక్కడి నుంచి ఒక్క మహిళను కూడా శబరిమల వైపు వెళ్లనిచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. ఎవరైనా వస్తే, తాము అడ్డంగా పడుకుని వారిని అడ్డుకుంటామని, అప్పటికీ వెనుదిరగకుండా ప్రయత్నిస్తే, రెండుగా చీలుస్తామని హెచ్చరిస్తున్నారు.

కాగా, కోజికోడ్ జిల్లాకు చెందిన బిందు అనే మహిళ, మరో 30 మందితో కలసి శబరిమలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుండగా, ఆమెనసలు ఇంటి బయటకే రానివ్వబోమని కోజికోడ్ మహిళా సంఘాలు వెల్లడించాయి. నేడు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక సమావేశం జరిపి, 'సేవ్ శబరిమల' పేరిట జరుగుతున్న నిరసనలు, మహిళలు ఎవరైనా వస్తే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనుంది. అయితే, మహిళా భక్తులకు ప్రత్యేక సౌకర్యాల పేరిట ఇంతవరకూ ఎటువంటి ఏర్పాట్లూ చేయలేదని అధికారులు తెలిపారు. బుధవారం నాడు ఆలయం తెరవనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

More Telugu News