Pakistan: చనిపోయిన వ్యక్తి పేరుపై మూడు బ్యాంకు ఖాతాలు.. రూ.460 కోట్ల లావాదేవీలు.. పాక్ బ్యాంకుల లీలలు!

  • పాకిస్థాన్‌లో పెరిగిపోతున్న మనీ లాండరింగ్ కేసులు
  • ప్రజల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్న బ్యాంకు అధికారులు
  • కోట్ల రూపాయల లావాదేవీలు

పాకిస్థాన్‌లోని రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్న కేసులు ఎక్కువయ్యాయి. దీంతో వీటికి అడ్డుకట్టే వేసేందుకు సుప్రీంకోర్టు.. జాయింట్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (జేఐటీ)ని నియమించింది. పలు బ్యాంకుల్లోని అనుమానాస్పద లావాదేవీలను తనఖీ చేస్తున్న జేఐటీ అధికారులు ఓ ఖాతాను చూసి షాక్‌కు గురయ్యారు. ఆ ఖాతా ద్వారా ఏకంగా రూ.460 కోట్ల లావాదేవీలు జరిగాయి. మరో విశేషం ఏమిటంటే, ఆ లావాదేవీలు నిర్వహించిన వ్యక్తి నాలుగేళ్ల క్రితమే చనిపోయినట్టు తేలడంతో అధికారులు విస్తుపోయారు.

కరాచీకి చెందిన ఇక్బాల్ అరయాన్ 9 మే 2014లో మృతి చెందాడు. అతడు మరణించిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు అతని పేరిట మూడు ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా రూ.460 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్టు ఫెడరల్ దర్యాప్తు సంస్థ (ఎఫ్ఐఏ) విచారణలో బయటపడింది. అంతేకాదు, బ్యాంకు అధికారులే ప్రజల పేరు మీద ఖాతాలు తెరిచి భారీ మొత్తంలో లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది. ఇటీవల ఇటువంటి కేసులు పాక్‌లో ఎక్కువయ్యాయి. ఓ చిరు వ్యాపారి ఖాతాలో ఒక్కసారిగా రూ.200 కోట్లు వచ్చిపడ్డాయి. ఓ ఆటో డ్రైవర్ ఖాతా ద్వారా రూ.300 కోట్ల లావాదేవీలు జరిగినట్టు వార్తలు వచ్చాయి. మరో వ్యక్తి ఖాతా నుంచి రూ.5 కోట్ల లావాదేవీలు జరిగాయి.

More Telugu News