Andhra Pradesh: సీఎం రమేశ్ ఓ గజదొంగ, బినామీ, బ్రోకర్ కాబట్టే.. ఇంట్లో హైటెక్ లాకర్లు ఉన్నాయి!: అంబటి రాంబాబు

  • చంద్రబాబుకు రమేశ్ నంబర్ వన్ బినామీ
  • గెస్ట్ హౌస్ రాజకీయాలతో ఎంపీ అయ్యారు
  • రిత్విక్ ఇప్పటిదాకా సబ్ కాంట్రాక్టులే తీసుకుంది

తెలుగుదేశం నేత, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నంబర్ వన్ బినామీ అని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. రమేశ్ పై ఐటీ దాడులు జరిగితే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఐటీ దాడుల వెనుక ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఉన్నాడని రమేశ్ ఆరోపించడంపై ఆయన మండిపడ్డారు. జగన్ ను విమర్శించే నైతిక అర్హత రమేశ్ కు లేదని తేల్చిచెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు.

తనిఖీలపై సీఎం రమేశ్ మీసాలు మెలేస్తుంటే, ఐటీ అధికారులు తొడలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రిత్విక్ కంపెనీ ఎన్నడూ భారీ కాంట్రాక్టులను చేపట్టలేదని స్పష్టం చేశారు. ఆ సంస్థ ఇప్పటివరకూ అన్నీ సబ్ కాంట్రాక్టులనే చేపట్టిందనీ, అవి కూడా బెదిరించి తీసుకున్నవేనని వెల్లడించారు. సీఎం రమేశ్ ఓ గజదొంగ, బినామీ, బ్రోకర్ కాబట్టే.. ఇంట్లో హైటెక్ లాకర్లు పెట్టుకున్నారని విమర్శించారు.

ఇంట్లో ఉన్న లాకర్లు సీఎం రమేశ్ వేలిముద్రతో మాత్రమే తెరుచుకుంటాయన్న విషయం కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవడం ఏంటని ప్రశ్నించారు. అసలు ఆ లాకర్లలో ఏం దాచారని ప్రశ్నించారు. పచ్చకాలం అంటే ఇదేనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం రమేశ్‌ సారా కాంట్రాక్టర్‌ దశ నుంచి పార్లమెంటు సభ్యుడి స్థాయికి రావడానికి గెస్ట్‌హౌస్ రాజకీయాలే కారణమని ఆరోపించారు. పచ్చకాలం ఎక్కువ కాలం ఉండదని, ప్రజలు బుద్ది చెప్పే రోజులు ముందున్నాయని అంబటి పేర్కొన్నారు.

More Telugu News