cinema: కెరీర్ లో ఎదుగుదల కోసం మహిళలు కాంప్రమైజ్ అవుతున్నారు.. మళ్లీ ‘మీ టూ’ అని చెబుతున్నారు!: బీజేపీ నేత ఉషా ఠాకూర్ షాకింగ్ వ్యాఖ్యలు

  • పదోన్నతుల కోసం రాజీ పడుతున్నారు
  • మీ టూ ను దుర్వినియోగం చేస్తున్నారు
  • మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు

సినీ పరిశ్రమతో పాటు మీడియా, రాజకీయ రంగాల్లో తమను లైంగికంగా వేధించిన ప్రబుద్ధుల పేర్లను మహిళలు ‘మీ టూ’ ఉద్యమం కింద బయటపెడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటులు నానా పటేకర్, అలోక్ నాథ్, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్, గీత రచయిత వైరముత్తు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తమను వేధించారని పలువురు మహిళలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఉషా ఠాకూర్ బాధిత మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కెరీర్ లో ఎదుగుదల, సొంత ప్రయోజనాల కోసం కొందరు మహిళలు రాజీ పడతారని వ్యాఖ్యానించారు.

ఉద్యోగం, వ్యాపారంలో ముందుకు వెళ్లడానికి కొందరు మహిళలు విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇస్తారని అన్నారు. దాని కారణంగానే మహిళలు ఇబ్బందులకు గురవుతారని తెలిపారు. అప్పుడు ప్రయోజనాలు పొందినవారే ఇప్పుడు ‘మీ టూ’ ఉద్యమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఉషా ఠాకూర్ వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలోనూ నవరాత్రి ఉత్సవాల వద్దకు హిందూ అమ్మాయిలను చూడటానికే ముస్లిం యువకులు వస్తారనీ, వారిని అనుమతించకూడదని ఉష వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

More Telugu News