Madhya Pradesh: ఎన్నికల నేపథ్యంలో రూ. 3 కోట్ల నకిలీ నోట్ల ముద్రణకు ఆర్డర్.. రంగంలోకి దిగిన పోలీసులు

  • మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నకిలీ కరెన్సీ పంపకం
  • రూ.31.50 లక్షల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • రాష్ట్ర హాకీ మాజీ ఆటగాడు అఫ్తాబ్ అలీ అరెస్ట్

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్ లో డబ్బు పంపిణీ భారీ ఎత్తున సాగుతోంది. మరోవైపు, ఓటర్లకు నకిలీ కరెన్సీని కూడా పంచుతున్నారు. భోపాల్ లో నకిలీ నోట్లను ముద్రించిన ఘటన వెలుగు చూసింది. నగరంలోని హోషానాబాద్, రాజ్ ఘడ్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు రూ. 31.5 లక్షల విలువ చేసే 2వేల నోట్లు, 500 రూపాయల ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ఈ నకిలీ నోట్ల ముద్రణలో రాష్ట్ర హాకీ మాజీ ఆటగాడు అఫ్తాబ్ అలీ అలియాస్ ముస్తాఖ్ ఖాన్ (42)ను కీలక వ్యక్తిగా గుర్తించారు. ఈ నేపథ్యంలో, అఫ్తాబ్ తో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకే నకిలీ నోట్లను ముద్రిస్తున్నారని పోలీసులు తెలిపారు. అసలైన కరెన్సీ నోట్లను స్కాన్ చేసి, నకిలీ నోట్లను ముద్రిస్తున్నారని వెల్లడించారు. ఓటర్లకు పంచేందుకు ఓ వ్యక్తి ఏకంగా రూ. 3 కోట్ల విలువైన నకిలీ నోట్ల ముద్రణకు ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయని చెప్పారు. ఈ భాగోతంలో అసలైన వ్యక్తిని గుర్తించే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

More Telugu News