KTR: తెలంగాణ కాంగ్రెస్‌ను రూ.500 కోట్లకు కొనుగోలు చేస్తున్న చంద్రబాబు!: కేటీఆర్‌ ఆరోపణలు

  • టీడీపీకి లీడర్‌ లేడు...కాంగ్రెస్‌కు క్యాడర్‌ లేదు
  • అటువంటి పార్టీ కలయిక జుగుప్సాకరం
  • ఎవరు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగా ఎమ్మెల్సీలను కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీని రూ.500 కోట్లకు కొనుగోలు చేస్తున్నారని మంత్రి తారక రామారావు (కేటీఆర్‌) విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో నాయకుడు లేడని, కాంగ్రెస్‌ పార్టీకి క్యాడర్‌ లేదని, అటువంటి రెండు పార్టీలు కలవడం జుగుప్సాకరమని ఎద్దేవా చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లోని ఎమ్మార్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. డెబ్బయేళ్ల చరిత్రలో తెలంగాణ రైతుల గురించి ఆలోచించిన నాయకుడు ఒక్కరు లేరన్నారు.  ఎకరానికి రూ.8 వేలు పంట పెట్టుబడి ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌ అన్నారు. రైతుల్ని కాల్చిచంపిన రాబందుల పక్కన నిలుస్తారా?, రైతు బంధువైన కేసీఆర్‌ వెంట ఉంటారో మీరే తేల్చుకోవాలని సూచించారు.

ఢిల్లీ నుంచి సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రి కావాలో, మన మట్టిలోనే పుట్టిన కేసీఆర్‌ కావాలో అన్నది మీరే నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలు మాగాణి అవ్వాలన్న లక్ష్యంతో కేసీఆర్‌.. కృష్ణ, గోదావరి జలాలను రప్పించేందుకు ప్రయత్నిస్తుంటే కేసులతో కాంగ్రెస్‌ నాయకులు వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు అంతిమమని, నాలుగేండ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, కేసీఆర్‌ ప్రభుత్వం పనితీరుపై ప్రజాకోర్టు ముందుకు వచ్చామని స్పష్టం చేశారు.

More Telugu News