Andhra Pradesh: తిత్లీ ఎఫెక్ట్.. శ్రీకాకుళం వాసులను నిట్టనిలువునా దోచుకుంటున్న వ్యాపారులు!

  • ఒక్కో కోడిగుడ్డు రూ.10కు విక్రయం
  • పచ్చికొబ్బరితో కడుపు నింపుకుంటున్న ప్రజలు
  • రెట్టింపు ధరకు వంటగ్యాస్ సిలిండర్ అమ్మకం

శ్రీకాకుళం జిల్లాపై విరుచుకుపడ్డ తిత్లీ తుపానుతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. కొబ్బరి, జీడి చెట్లు నేలకొరగడంతో రైతన్నలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక జిల్లాలోని సామాన్యులు, పేదల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చాలాచోట్ల తాగేందుకు స్వచ్ఛమైన నీరు, తినేందుకు ఆహారం లభించక అల్లాడిపోతున్నారు. తిత్లీ ప్రభావంతో నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు నిత్యావసరాలను ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారు.

కేవలం రూ.5 ఉన్న కోడిగుడ్డును వ్యాపారులు రూ.10కు అమ్ముతున్నారు. అలాగే 25 లీటర్లు ఉన్న తాగునీటి క్యాన్ ఏకంగా రూ.50కు చేరుకుంది. చాలాచోట్ల కూరగాయలు లభించకపోవడంతో సామాన్యులు పచ్చడితో సరిపెట్టుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంది. అధికారులు సహాయ సామగ్రితో చేరుకోకపోవడంతో చాలామంది పచ్చి కొబ్బరిని తిని బతుకుతున్నారు. ఇంకొన్నిచోట్ల కూరగాయలు లభించకపోవడంతో పచ్చి బొప్పాయి కూర చేసుకుని పూట గడుపుతున్నారు.

ఇక పెట్రోల్, వంటగ్యాస్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయి. ఓ లీటర్ పెట్రోల్ ను రూ.150కు, వంటగ్యాస్ సిలిండర్ ను రెట్టింపు ధరకు అమ్ముతూ వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. మరోవైపు గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో వజ్రపుకొత్తూరు గ్రామానికి చెందిన ప్రజలు కరెంట్ తీగలపై బట్టలను ఆరేసుకుంటున్నారు.

More Telugu News