Team India: ఉప్పల్‌లో గెలిచి ప్రపంచ రికార్డును సమం చేసిన టీమిండియా

  • ఉప్పల్ టెస్టులో భారత్ ఘన విజయం
  • స్వదేశంలో వరుసగా పది టెస్టు సిరీస్ విజయాలు
  • ఆస్ట్రేలియా సరసన టీమిండియా

విండీస్‌తో ఉప్పల్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెంటు టెస్టుల సిరీస్‌ను 2-0తో గెలుచుకుని విండీస్‌ను వైట్ వాష్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను ఎదురొడ్డిన విండీస్ బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో దానిని కొనసాగించలేకపోయారు. భారత బౌలర్ ఉమేశ్ యాదవ్ నిప్పులు చెరిగే బంతులకు పెవిలియన్‌కు క్యూకట్టారు. ఉమేశ్ మొత్తం పది వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.

విండీస్‌పై గెలుపుతో భారత్ ఖాతాలోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. స్వదేశంలో వరుసగా పది టెస్టు సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఈ రికార్డును సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా సరసన నిలిచింది. ఆస్ట్రేలియా రెండుసార్లు ఈ ఘనత సాధించింది. 1994/95-2000/2001లో ఒకసారి, 2004-2008/09లో మరోసారి వరుసగా పది టెస్టుల్లో విజయం సాధించింది. ఇక, భారత్ విజయాల పరంపర 2012 నుంచి కొనసాగుతోంది.

తొలుత ఆస్ట్రేలియాపై సిరీస్ విజయంతో మొదలుపెట్టిన భారత్ వరుసగా విండీస్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌లపై సిరీస్ విజయాలు సాధించింది. తాజాగా మరోమారు విండీస్‌పై సిరీస్‌ను గెలుచుకుంది.

More Telugu News