: నాలుగు వేదాలూ ఔపోసన పట్టిన అఫ్జల్ గురు

ఉరికంబం ఎక్కిన ఉగ్రవాది అఫ్జల్ గురులో ఆధ్మాత్మిక భావాలు అధికం. ఈ మాట అంటున్నది సాక్షాత్తు అతనికి ఉరిశిక్ష అమలు చేసిన తీహార్ జైలు అధికారులే. పార్లమెంటుపై దాడి కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవించే సమయంలో అఫ్జల్ నాలుగు వేదాలను చదివేశాడు. అంతేకాదు, ఇస్లాం మతానికి, హిందూ మతానికి మధ్య ఉన్న సారూప్యతల గురించి అతడు జైలు అధికారులతో చర్చించేవాడని హిందూ దినపత్రికకు ఇంటర్యూ ఇచ్చిన తీహార్ జైలు అధికారి తెలిపారు. అసలు హిందువులలో ఎంతమంది వేదాలను చదివి వుంటారని ఆయన ప్రశ్నించారు.

ఉరిశిక్ష అమలు చేయబోయే సమయంలో కూడా అఫ్జల్ చాలా ప్రశాంతంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. ఉరి తీయబోయే రోజు ఉదయమే శిక్ష అమలు చేయబోతున్నామని అతనికి తెలిపామని అధికారులు చెప్పారు. ఆ రోజు ఉదయం టీ మాత్రమే తాగిన అఫ్జల్, కుటుంబానికి లేఖ రాశాడు. తెల్లటి లాల్చీ, పైజమా ధరించి నమాజ్ చేశాడు. తనకు బాధ కలిగించకుండా చూడమని తలారి దగ్గర హామీ తీసుకున్న అఫ్జల్, ప్రశాంతంగా ఉరికంబం ఎక్కాడని జైలు అధికారులు తెలిపారు. ఉరి తీసిన ఒక్క నిమిషంలోనే అతను ప్రాణాలు వదిలినా, నిబంధనల ప్రకారం అరగంటసేపు అతనిని ఉరికంబానికి వేలాడదీసినట్లు అధికారులు తెలిపారు. 

ఎంతోమంది నేరస్తులకు ఉరిశిక్ష అమలు చేసినా, వారందరూ మరణ వార్త తెలియగానే భయంతో వణికేవారని, రాజకీయ వాదనలను వినిపించేవారని జైలు అధికారి తెలిపారు. అయితే అఫ్జల్ ప్రశాంతంగా ఉరికంబం ఎక్కడానికి అతని ఆధ్యాత్మికతే సహకరించి ఉంటుందని వారన్నారు. ఆఖరి ప్రయాణంలో జైలులో పరిచయమున్న అధికారులందరికి పేరు పేరునా అఫ్జల్ 'అల్విదా (వీడ్కోలు)' తెలిపాడని చెప్పారు. 

జైలు అధికారులతో తరచు సంభాషించే అఫ్జల్ అనవసరంగా ఇందులో ఇరుక్కున్నానని తెలిపేవాడని, చనిపోయే ముందు కూడా జీవన్మరణాలపై తన భావాలను పుస్తకంలో రాసి, సంతకం చేశాడని అధికారులు చెప్పారు. అఫ్జల్ కు ఉరిశిక్ష అమలు చేయడంతో అతని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తీహార్ జైలు అధికారులు విషాదంలో మునిగిపోయారు.

More Telugu News