Liquor: మద్యం ప్రియులకు సూపర్ న్యూస్.. మహారాష్ట్రలో ఇక డోర్ డెలివరీ!

  • డ్రంకెన్ డ్రైవ్‌లకు చెక్
  • ఆధార కార్డ్ తప్పనిసరి 
  • దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డు?

ఈ-కామర్స్ రంగం విస్తరించిన తర్వాత ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండానే కావాల్సిన వస్తువును తెప్పించుకునే వెసులుబాటు లభించింది. గుండు పిన్నుల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు, చింతపండు నుంచి చాయ్ పొడి వరకు అన్నీ ఇలా ఆర్డర్ చేస్తే అలా ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇప్పుడిందులోకి మద్యం కూడా వచ్చి చేరింది. లిక్కర్‌ను డోర్ డెలివరీ చేయాలని  మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే, దీని వెనుక ఓ లక్ష్యం ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.

డ్రంకెన్ డైవ్ కారణంగా పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి చంద్రశేఖర్ బవాంకులే తెలిపారు.  మద్యం ప్రియులు తాగి వాహనాలు నడుపుతున్నారని, ఫలితంగా ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వాటికి చెక్ పెట్టేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్టు చెప్పారు. అయితే, మద్యాన్ని ఎవరికి పడితే వారికి విక్రయించబోమని, ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు.

మద్యం బాటిళ్లకు జియో ట్యాగింగ్ ఉంటుందని, కాబట్టి విక్రయాదారుడు-కొనుగోలుదారుడిని ఎప్పటికప్పుడు ప్రభుత్వం ట్రాక్ చేస్తుందని వివరించారు. మద్యాన్ని డోర్ డెలివరీ చేయడం వల్ల కల్తీ మద్యాన్ని అరికట్టడంతోపాటు స్మగ్లింగ్ కూడా తగ్గుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ విధానాన్ని కనుక అమల్లోకి తెస్తే.. మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా మహారాష్ట్ర రికార్డులకెక్కుతుంది.

More Telugu News