Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది ప్రకాశం జిల్లా వాసుల దుర్మరణం

  • దుర్గాదేవిని దర్శించుకుని వస్తుండగా ప్రమాదం
  • మృతి చెందిన పదిమందిలో 9 మంది ప్రకాశం జిల్లా వారే
  • జిల్లాలో విషాద ఛాయలు

చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది ప్రకాశం జిల్లావాసులు దుర్మరణం పాలయ్యారు. రాజనందగావ్ జిల్లాలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. డోంగర్‌గఢ్ సమీపంలోని 'మా బమలేశ్వరీ దేవి' ఆలయాన్ని సందర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనాన్ని సోమని గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతి చెందిన పదిమందిలో తొమ్మిదిమంది ప్రకాశం జిల్లాకు చెందిన వలస కార్మికులు వుండడం గమనార్హం.

భిలాయ్‌లోని క్యాంప్-1లో నివాసముంటున్న 13 మంది దుర్గామాత ఆలయ సందర్శనకు శనివారం డోంగర్‌గడ్‌ వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం తిరిగి వస్తుండగా ఉదయం ఏడు గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం  పాపాయిపల్లికి చెందిన శెట్టి మంజు (18), శెట్టి వెంకటలక్ష్మీ (27), హనుమంతునిపాడు మండలం మంగంపల్లికి చెందిన పాపాబత్తుని పెద్ద మంగయ్య (30), అతడి భార్య వెంకటలక్ష్మి(25), పాపాబత్తుని మనీషా(15), సీఎస్‌పురం మండలం వెంగనగుంట గ్రామానికి చెందిన కుడారి ఆదినారాయణ(32), ఆయన భార్య సావిత్రి (28), మర్రిపూడి మండలం గార్లపేటకు చెందిన అండ్ర విజయ్‌కుమార్‌(32), అతడి భార్య నాగమణి (25) అక్కడికక్కడే మృతి చెందారు.

శెట్టి వెంకటలక్ష్మి భర్త శెట్టి వెంకటేశ్వర్లు, శెట్టి బాబు, మంగంపల్లికి చెందిన పాపాబత్తుని మహేంద్రలు తీవ్రంగా గాయపడ్డారు. కుడారి ఆదినారాయణ, భార్య సావిత్రిల ఏకైక కుమారుడు నితీష్‌(5) ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాద వార్త తెలిసి ప్రకాశం జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదం అనంతరం పరారైన లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News