Uttar Pradesh: పోలీసుల సమయస్ఫూర్తి...చిక్కిన కరుడుగట్టిన నేరస్తుడు

  • నిందితుడిని పట్టుకునే క్రమంలో చుట్టుముట్టిన పోలీసులు
  • ఎదురు కాల్పుల ప్రమాదాన్ని ఊహించి పిస్తోల్‌ తీసిన ఇన్‌స్పెక్టర్‌
  • అది కాస్తా జామ్‌ కావడంతో మిమిక్రీతో కాల్పుల శబ్దంచేసి సహకరించిన కానిస్టేబుల్‌

కరుడుగట్టిన నేరస్తులను పట్టుకునే సమయంలో పోలీసులు ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తే ప్రాణాపాయం అంత దూరంగా ఉంటుంది. సాధారణంగా క్రిమినల్స్‌ తప్పించుకునే క్రమంలో ఎంతకైనా తెగిస్తారు. ఈ పరిస్థితుల్లో జాగరూకత చాలా ముఖ్యం. ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు ఇటీవల అటువంటి పరిస్థితే ఎదురయింది. క్రిమినల్‌ని పట్టుకునే క్రమంలో బెదిరించేందుకు సీఐ పిస్తోల్‌ బయటకు తీయగా అది మొరాయించింది. ప్రమాదాన్ని పసిగట్టిన పక్కనే ఉన్న కానిస్టేబుల్‌ గాలిలోకి కాల్పులు జరిపినట్లు మిమిక్రీ చేసి నేరగాళ్ల కదలికలకు అడ్డుకట్ట వేశాడు.

 వివరాల్లోకి వెళితే...రుక్సార్‌ అనే నేరస్తుడు 18 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడు. ఎప్పటి నుంచో తప్పించుకు తిరుగుతున్న రుక్సార్‌ జాడను సంబార్‌ జిల్లా పోలీసులు ఇటీవల కనుక్కొన్నారు. అతనో చెరుకు తోటలో దాక్కున్నాడని గుర్తించి చుట్టుముట్టారు. గాల్లోకి కాల్పులు జరిపి లొంగిపోవాల్సిందిగా హెచ్చరించారు. దీంతో రుక్సార్‌ వైపు నుంచి కూడా కాల్పులు మొదలయ్యాయి.

ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్‌ పిస్తోల్‌ జామ్‌ అయింది. ఈ విషయం తెలిస్తే రుక్సార్‌ గ్యాంగ్‌ ప్రాణాలు తీసి తప్పించుకుంటుందని భావించిన ఓ కానిస్టేబుల్‌ గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్లుగా మిమిక్రీతో శబ్దాలు చేశాడు. ఇంతలో మిగిలిన పోలీసులు అప్రమత్తమై రుక్సార్‌ కాలిపై కాల్పులు జరపడంతో అతను పోలీసులకు చిక్కాడు. రుక్సార్‌ తలపై రూ.25 వేల రివార్డు ఉంది.

More Telugu News