AOB: ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో జాయింట్‌ ఆపరేషన్‌కు తాత్కాలిక విరామం

  • బలగాలకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు
  • కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రక్రియకు బ్రేక్‌
  • వెనుదిరిగి వస్తున్న భద్రతా సిబ్బంది

ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో రెండు రాష్ట్రాలకు చెందిన భద్రతా బలగాల ఆధ్వర్యంలో జరుగుతున్న జాయింట్‌ ఆపరేషన్‌కు అధికారులు తాత్కాలిక విరామం ప్రకటించారు. గత కొన్ని రోజులుగా మన్యాన్ని జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు తీవ్రంగా అలసిపోయాయని, వారికి విశ్రాంతి అవసరమని నిర్ణయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏవోబీలో కూంబింగ్‌ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉన్న ఆంధ్రాకు చెందిన స్పెషల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌ దళాలు, ఒడిశాకు చెందిన బీఎస్‌ఎఫ్‌, ఎన్‌ఓజీ బలగాలు దఫదఫాలుగా వారి వారి బేస్‌ క్యాంపులకు చేరుకుంటున్నారు.

గడచిన తొమ్మిది నెలల నుంచి స్తబ్ధుగా ఉన్న ఏవోబీలో లివిటిపుట్టు వద్ద అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు పట్టపగలు అంతా చూస్తుండగానే కాల్చిచంపడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మరో నాయకుడు హత్యకు గురికావడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటన విషయంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించడంతో విమర్శలు వెల్లువెత్తాయి.

 దీంతో అప్రమత్తమైన పోలీసులు ఏజెన్సీలో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. కిడారి, సివేరిలను చంపిన మావోయిస్టులు ఎంతో దూరం వెళ్లి ఉండరన్న ఉద్దేశంతో మన్యాన్ని జల్లెడ పట్టారు. మూడు రోజుల క్రితం మల్కన్‌గిరి జిల్లా అండ్రపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనతో కొంతలో కొంత ప్రతీకారం తీర్చుకున్నట్లయిందని భావిస్తున్న పోలీసులు బలగాలకు తాత్కాలిక విరామం ప్రకటించారని అనుకుంటున్నారు. జాయింట్‌ ఆపరేషన్‌ నిలిపి వేస్తున్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు వెనుదిరుగుతున్నాయి.

More Telugu News