Russia: కరెంట్ బిల్లు పెరగడానికి పిల్లి కారణమన్న వినియోగదారుడు.. ఆశ్చర్యపోయిన జడ్జిగారు!

  • బిల్లు ఎందుకు చెల్లించలేదంటే వింత వాదన
  • అంత పెద్దమొత్తం విద్యుత్‌ తాము వినియోగించమని స్పష్టీకరణ
  • తప్పుడు వాదనకు మందలించి జరిమానా విధించిన న్యాయమూర్తి

విద్యుత్‌ను పెద్ద మొత్తంలో వినియోగించి తీరా బిల్లు వచ్చాక కట్టడం లేదెందుకు? అని న్యాయమూర్తి ప్రశ్నిస్తే, ‘అయ్యా అది నేను చేసిన ఖర్చు కాదు, మా పిల్లి ట్యాంపరింగ్‌ వల్ల మీటరు అలా అడ్డగోలుగా తిరిగింది’ అంటూ వినియోగదారుడు విచిత్రమైన సమాధానం ఇవ్వడంతో ఆశ్చర్యపోవడం జడ్జీగారి వంతైంది.

ఆ వివరాల్లోకి వెళితే, రష్యాలో బర్నల్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు విద్యుత్‌ వినియోగించినందుకు రూ.92,200 (80 వే రూబెల్స్‌) బిల్లు వచ్చింది. సకాలంలో అతను బిల్లు కట్టకపోవడంతో అక్కడి విద్యుత్‌ శాఖ అతన్ని కోర్టుకీడ్చింది. కోర్టులో వాద ప్రతివాదనల సందర్భంగా న్యాయమూర్తి బిల్లు ఎందుకు కట్టలేదు? అని ప్రశ్నిస్తే ‘మేమైతే అంత పెద్ద మొత్తంలో విద్యుత్‌ వినియోగించం, మా పిల్లి ఎనర్జీ మీటరును ట్యాంపర్‌ చేసింది’ అని చెప్పాడు.

అదెలా సాధ్యం? అని న్యాయమూర్తి అడిగేసరికి ‘మా పిల్లి ఎప్పుడూ ఇంటిపైనే గంతులేస్తుంది, ఎనర్జీ మీటరు పై నుంచే అది పైకి పాకుతుంది. అలా ఏదో సందర్భంలో దాని పదునైన గోళ్లతో సీళ్ల ట్యాంపరింగ్‌కు పాల్పడింది’ అని ధీమాగా చెప్పాడు. ఈ ఆరోపణలను విద్యుత్‌ శాఖ న్యాయవాది ఖండిస్తూ మీటరు సీల్‌ కట్‌ చేయాలంటే ఎక్ట్రీషియన్‌ బలమైన కటింగ్‌ ప్లేయర్‌ ఉపయోగిస్తేగాని సాధ్యం కాదని, అటువంటిది పిల్లి ట్యాంపరింగ్‌ చేయడం అసాధ్యం అని వాదించాడు.

 అతని వాదనతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ సదరు యువకుడిని మందలించారు. వచ్చిన బిల్లు మొత్తంతోపాటు రూ.2800 (2,500 రూబెల్స్‌) జరిమానా కూడా చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.

More Telugu News