Alibaba: మార్కెట్‌ విస్తరణపై చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా దృష్టి.. స్పెన్సర్స్ కోసం ప్రయత్నం!

  • స్పెన్సర్స్‌ సూపర్‌ మార్కెట్లు కొనుగోలు చేసేందుకు మంతనాలు
  • వాటా అమ్మకంపై చర్చలు జరుపుతున్న స్పెన్సర్స్‌ ప్రతినిధులు
  • వివరాల వెల్లడికి నిరాకరించిన గొయంకా గ్రూపు ప్రతినిధులు

భారత్‌ మార్కెట్‌పై ఈ-కామర్స్‌ సంస్థలు దృష్టిసారించాయి. విస్తృత మార్కెట్‌ అవకాశాలు ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో వ్యాపారం బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ సంస్థలు మార్కెట్ విస్తరణపై దృష్టి సారించాయనిపిస్తోంది. మొన్న వాల్‌మార్ట్‌, ఆ తర్వాత అమెజాన్‌, తాజాగా ఆలీబాబా ఇండియా మార్కెట్లపై దృష్టి పెట్టాయి.

చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం ఆలీబాబా ఇండియాలో మార్కెట్‌ విస్తరణలో భాగంగా ఆర్‌పి సంజీవ్‌ గొయంకా గ్రూప్‌కు చెందిన స్పెన్సర్స్‌ సూపర్‌ మార్కెట్లలో వాటాలు చేజిక్కించుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆలీబాబా ప్రతినిధులు గొయంకా కార్యాలయానికి వచ్చి వాటాల కొనుగోలు అంశంపై చర్చలు జరిపారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నా సంస్థ ప్రతినిధులు వివరాల వెల్లడికి ఇష్టపడడం లేదు.

మరోవైపు స్పెన్సర్స్‌ అమెజాన్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సంస్థల్లో ఏదో ఒక సంస్థకు తన వాటాలు విక్రయించేందుకు ఈ సంస్థ సిద్ధంగా ఉందని సమాచారం. ఈ ఏడాది తొలినాళ్లలో ప్రపంచ రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ దేశంలో అతిపెద్ద ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 76 శాతం వాటాను 1600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత అమెజాన్‌, సమారా క్యాపిటల్‌ కలిసి ఆదిత్య బిర్లా రిటైల్‌ నిర్వహణలో ఉన్న మోర్‌ సూపర్‌ మార్కెట్లలో వాటాను రూ.4,200 కోట్లకు చేజిక్కించుకున్నాయి. తాజాగా ఆలీబాబా డీల్ ఓకే అయితే మరోపెద్ద వాణిజ్య ఒప్పందం జరిగినట్టే.

More Telugu News